రాయగడ: తుఫాన్ ముప్పును దృష్టిలో పెట్టుకుని ప్రజలకు అత్యవసర సహాయం అందించేందుకు రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక ముందస్తు చర్యలు చేపట్టారు. తుఫాను ప్రభావంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నా తక్షణమే స్పందించేలా తన చొరవతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ.. అవసరమైన వాహనాలు, సహాయక పరికరాలను సిద్ధం చేసి అప్రమత్తంగా ఉండాలని బృంద సభ్యులకు సూచించారు. ఈ మేరకు బుధవారం తన కార్యాలయంలో సహచరులతో సమావేశమైన ఆయన తుఫాన్ పరిస్థితులు ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. తుఫాన్ సమయంలో చెట్లు కూలి రహదారులు మూసుకుపోయినా, విద్యుత్ సరఫరాలకు అంతరాయం ఏర్పడినా, ఇతర అత్యవసర పరిస్ధితులు తలెత్తినా వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ప్రజలకు సహాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.


