నియమగిరి సురక్ష సమితి భారీ ర్యాలీ | - | Sakshi
Sakshi News home page

నియమగిరి సురక్ష సమితి భారీ ర్యాలీ

Oct 28 2026 5:54 AM | Updated on Oct 28 2026 5:54 AM

నియమగిరి సురక్ష సమితి భారీ ర్యాలీ

● నియమగిరిని కార్పొరేట్‌ సంస్థకు

అప్పగించే ప్రయత్నాలను

విరమించుకోవాలని డిమాండ్‌

రాయగడ: నియమగిరి పర్వతాలను వేదాంత సంస్థకు అప్పగించే ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని నియమగిరి సురక్ష సమితి డిమాండ్‌ చేసింది. జల, భూమి, అటవీ సంపద పరిరక్షక్షణతోపాటు గిరిజనుల హక్కుల సాధన కోసం మంగళవారం జిల్లాలోని మునిగుడలో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రిని ఉద్దేశించి రూపొందించిన డిమాండ్ల వినతిపత్రాన్ని తహసీల్దార్‌ ద్వారా ప్రభుత్వానికి సమర్పించారు.

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు..

2023లో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నిర్వహించిన 12 గ్రామ సభల్లో స్థానిక గిరిజనులు.. వేదాంత సంస్థ ఖనిజ తవ్వకాల ప్రాజెక్టును స్పష్టంగా తిరస్కరించారని సమితి నాయకులు గుర్తు చేశారు. అయినప్పటికీ మరోసారి నియమగిరి పర్వతాలను కంపెనీకి అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. నియమగిరిని తమ ఇష్టదైవంగా, జీవనాధారంగా భావించే డొంగ్రియా తెగకు చెందిన ఆదివాసీలు, స్ధానిక ప్రజలు ఇటువంటి విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు.

ఉద్యమకారులపై అక్రమ కేసులు..

నియమగిరి పరరక్షణ ఉద్యమాన్ని అణిచివేసేందుకు పోలీస్‌ యంత్రాంగం దమనకాండకు పాల్పడుతోందని సమితి ఆరోపించింది. సమితి అధ్యక్షుడు లొద సికక, సలహాదారు లింగరాజ్‌ అజాద్‌ సహా పలువురు నాయకులపై తప్పుడు కేసులు నమోదు చేసి జైలులో ఉంచారని పేర్కొంది. గత సెప్టెంబరులో లంజిఘడ్‌ కోర్టు నుంచి బైయిల్‌పై తిరిగి వస్తున్న సమయంలో లొద సికకాను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని, ఆయనపై పలు కేసులు నమోదు చేశారని సమితి ప్రతినిధి, న్యాయవాది నరేంద్ర మహంతి వెల్లడించారు.

ప్రధాన డిమాండ్లు ఇవే..

ముఖ్యమంత్రికి సమర్పించిన వినతిపత్రంలో సమితి పలు కీలక డిమాండ్లను ప్రస్తావించింది. నియమగిరిని వేదంత సంస్థకు అప్పగించే ప్రయత్నాలు నిలిపివేయాలని, లొద సికకతోపాటు ఇతర ఉద్యమకారులపై నమోదైన కేసులను ఉపసంహరించుకొని వారిపై తక్షణమే విడుదల చేయాలని కొరింది. లంజిఘ్‌ అలూమినియం ప్రాజెక్టు కారణంగా కాలుష్యం పెరుగుతోందని పేర్కొంటూ ఆ ప్రాజెక్టును వెంటనే నిలిపివేయాలని డిమాండ్‌ చేసింది. గ్రామసభల అనుమతి లేకుండా ఎలాంటి ప్రాజెక్టులకు ఆమోదం తెలపకూడదని స్పష్టం చేసింది. పీసా చట్టం, అటవీ హక్కుల చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని, నియమగిరి ప్రాంతంలో స్థానిక భాషలో విద్యా బోధన అందించే పాఠశాలలను ఏర్పాటు చేయడంతోపాటు సామాజిక ఆరోగ్య కేంద్రాలను నిర్మించాలని కోరింది. ఈ నిరసన కార్యక్రమంలో ప్రముఖ ఉద్యమకారుడు ప్రపుల్ల సామంతరాయ్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement