కొరాపుట్: కొరాపుట్, నబరంగ్‌పూర్ జిల్లాలు తుఫాన్ నేపథ్యంలో తీవ్ర భయకంపితులై ఉన్నాయి. మంగళవారం ఉదయం నుంచి తీవ్ర మైన మబ్బులతో వాతావరణం నిండిపోయింది. ఉదయం ఆంధ్రా–ఒడిశా సరిహద్దు సుంకి ప్రాంతం నుంచి చిన్న చిన్న జల్లులు తో ప్రారంభమైన వాన సాయంత్రానికి నబరంగ్‌ఫర్ జిల్లా సరిహద్దు చత్తీస్‌గఢ్ వరకు కొనసాగింది. రానున్న ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు ఎన్నడూ లేని విధంగా రక్షణ ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి కృష్ణచంద్ర పాత్రో నబరంగ్‌పూర్ జిల్లాలో మూడు రోజులు మకాం వేయడానికి చేరుకున్నారు. అనంతరం ఉన్నతాధికారులతో కలసి అప్పర్ ఇంద్రావతి హైడ్రో పవర్ ప్రాజెక్ట్‌కు నీరందిస్తున్న రిజర్వాయర్‌ని సందర్శించారు. అక్కడ ఓహెచ్‌పిసీ అధికారులతో నీటి నిల్వలు అడిగి తెలుసు కున్నారు. మంత్రి వెంట నబరంగ్‌పూర్ ఎంపీ బలబద్ర మజ్జి, ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి, మాజీ ఎంపీ పరశురాం మజ్జిలు ఉన్నారు. అనంతరం జిల్లా కలెక్టరేట్‌లో తుఫాన్ ఎదుర్కొనేందుకు సమీక్ష నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ మధు స్మిత, ముఖ్యమంత్రి సలహాదారు మహేశ్వర్ స్వయ్ ఉన్నారు. అంతకు ముందు కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఇంత వరకు 320 మంది గర్భిణులను సురక్షిత వైద్యశాలలకు తరలించామన్నారు. మరో వైపు కొరాపుట్ జిల్లాలో తుఫాన్ సహాయ ప్రత్యేక అధికారిని పోమా తుడు సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశం లో కొరాపుట్ జిల్లా కలెక్టర్ సత్యావాన్ మహాజన్ పాల్గొన్నారు. కొండ చరియలు పడుతుండడంతో బొరిగుమ్మ–రాణిగడ్–కొరాపుట్ రహదారి ని మూసి వేశారు. వాహనాలను జయపూర్ మీదుగా పంపుతున్నారు. విశాఖపట్నం నుంచి కొరాపుట్ వచ్చే 8 రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.


