జయపురం: ఒక బొలోరా వెహికల్ కేసులో కొట్‌పాడ్ పోలీసులు నలుగురు దొంగలను అరెస్టు చేశారు. అరెస్టయిన నిందితులు సుబేన్ మహానందియ, సురేష్ హంతాల్, కిశాన్ దురియ, ప్రదీప్ క్షెముండులు అని బొరిగుమ్మ సబ్‌డివిజన్ పోలీసు అధికారి సత్యబ్రత లెంక తెలిపారు. కొట్‌పాడ్ పోలీసు స్టేషన్ సభా గృహంలో పోలీసులు నిర్వహించిన మీడియా సమావేశంలో సత్యబ్రత లెంక పాల్గొని ఈ కేసు వివరాలు వివరించారు. ఈ నెల 11 వ తేదీన కొట్‌పాడ్ పోలీసు స్టేషన్ పరిధి కుసిమి గ్రామంలో ప్రదీప్ సాహు తన బొలేరో వాహనం ఇంటివద్ద పార్కింగ్ చేయగా దుండగులు దొంగిలించారు. ఈ విషయం ప్రదీప్ కొట్‌పాడ్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేశారని, ఈ నేపథ్యంలో దుండగులు వెహికల్ తిరిగి ఇచ్చేందుకు రూ.80 వేలు డిమాండ్ చేశారని పోలీసు అధికారి వెల్లడించారు. దర్యాప్తు జరుపుతున్న పోలీసులు తాము సేకరించిన ఆధారాలతో బొలేరో వాహనంతో పాటు నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్‌డీపీఓ సత్యబ్రత లెంక వెల్లడించారు.
నల్ల అడవిపిల్లి దాడిలో
నలుగురికి గాయాలు
జయపురం: జయపురం సడ్‌డివిజన్ బొయిపరిగుడ సమితిలో నల్లని అడవి పిల్లి దాడిలో నలుగురు గ్రామీణులు గాయపడ్డారు. రెండు గ్రామాల్లో గత రాత్రి జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బొయిపరిగుడ సమితి దొరాగుడ లో గత రాత్రి బిభీషణ్ నాయిక్, నమితా గొలారి, రాజకుమాన్ నాయిక్‌లు ఇంటి ముందు ఆరుబయట కూర్చొని మాట్లాడుకుంటున్న సమయంలో ఒక అడవి పిల్లి అకస్మాత్తుగా వచ్చి వారిపై దాడి చేసింది. అడవి పిల్లి దాడి నుంచి వారిని కాపాడేందుకు వచ్చిన మరో వ్యక్తి గాయపడినట్లు సమాచారం. అదేవిదంగా బొయిపరిగుడ సమితి ఖెందుగుడ గ్రామ పంచాయతీ ధనపురియ గ్రామంలో రాత్రి 8.30 గంటల సమయంలో బృందావణి కావడియ అనే మహిళ వంట చేసి బయటకు వస్తున్న సమయంలో ఒక అడవి పిల్లి ఆమైపె దాడి జరిపింది. కొద్ది సమయంలో రెండు ప్రాంతాలలో అడవి పిల్లి ప్రజలపై దాడి జరిపి గాయపరచంతో గ్రామీణ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అడవి పిల్లి దాడులలో తీవ్రంగా గాయపడిన నలుగురికి బొయిపరిగుడ కమ్యూనిటీ హాస్పిటల్ కు తరలించారు. ప్రాధమిక చికిత్స అనంతరం వారిని డిశ్చార్జ్ చేశారు.
యువకుడి మృతి
రాయగడ: ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు వలస వెళుతున్న కార్మికుల జీవితాలు ప్రమాదాల బారిన పడుతున్నాయి. తాజాగా గుజరాత్‌లోని వడొదర నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లాలోని గుడారి సమితి పెండిలి పంచాయితీలోని గౌడొ డెఫాగుడలో నివాసముంటున్న 23 ఏళ్ల వలస కార్మికుడు హేమానంద నిమాల్ మృతి చెందాడు. కుటుంబానికి అండగా నిలిచే ఏకై క సంపాదనపరుడిని కోల్పోవడంతొ అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. డెఫాగుడ గ్రామానికి చెందిన టిటిమిరి నిమాల్ కుమారుడు హేమానంద్ నిమాల్ ఉపాధి కోసం గుజరాత్‌లోని వడొదరకు వలస వెళ్లాడు. అక్కడ ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఏదో పనిమీద స్కూటీపై జాతీయ రహదారిపై వెళ్తుండగా వెనుక నుంచి అతివేగంగా వచ్చిన హైవా వాహనం అతడిని బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో అతడు తీవ్రగాయాలకు గురై అక్కడిక్కడే మృతి చెందాడు. ప్రమాద విషయాన్ని కుటుంబీకులకు తెలియజేశారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో జిల్లా యంత్రాంగం సహాయం చేయాలని కోరుతున్నారు.


