● పార్వతీపురం మున్సిపల్ చైర్‌పర్సన్
అభ్యర్థినిగా సాయిశ్రీ
● వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ
రాయగడ: జిల్లా కేంద్రం రాయగడకు చెందిన యువతి ఇప్పిలి సాయిశ్రీ పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పార్వతీపురం మున్సిపల్ చైర్‌పర్సన్ పదవికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. ఈ విషయం తెలియడంతో రాయగడ, గుణుపూర్ ప్రాంతాల్లో ఆమె పోటీపై ఆసక్తి నెలకుంది. అధికార తెలుగుదేశం పార్టీ అభ్యర్థినికి ఆమె గట్టి పోటీ ఇస్తున్నట్టు సమాచారం. సాయిశ్రీ కుటుంబం రాయగడ పట్టణంలోని న్యూకాలనీలో నివసిస్తుంది. ఆమె తండ్రి స్వర్గీయ ఇప్పిలి మోహనరావు రాయగడ కళాశాలలొ అధ్యాపకుడిగా పనిచేశారు. తల్లి గృహిణికాగా అక్క ఇప్పిలి కళ్యాణి, సాయిశ్రీకి పట్నాన సాయికిరణ్‌తో వివాహం జరిగింది. వివాహం అనంతరం ఆమె పార్వతీపురం పట్టణంలొ నివాసం ఉంటున్నారు. ఆ తర్వాత వైఎస్సార్‌సీపీలో చేరిన ఆమె రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. పార్టీ అఽధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలాఉండగా మున్సిపల్ చైర్‌పర్సన్ వంటి కీలక పదవికి ఆమె పోటీలో ఉండడంతో రాయగడ, గుణుపూర్ ప్రాంతాల్లో ఆమెకు మద్దతుగా చర్చ సాగుతోంది. రాయగడ జిల్లాకు చెందిన పలువురు బంధువులు, అభిమానులు పార్వతీపురం వెళ్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అలాగే రాయగడ జిల్లా కళింగవైశ్య సంఘం అధ్యక్షుడు కింతలి అమర్‌నాఽథ్, మజ్జిగౌరమ్మ మందిరం ట్రస్టు సభ్యులు ఇప్పిలి సన్యాసిరాజు, కొత్తకొట నరీన్ కుముంధాన్ వంటి ప్రముఖులు ఆమె విజయానికి ఇక్కడి నుంచి కృషి చేస్తున్నారు. పార్వతీపురంలో ఉన్న తమ బంధువులకు ఫోన్లలో సంప్రదిస్తూ ఆమె విజయానికి సహకరించాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా నరీన్ కుముంధాన్, ఇప్పిలి సన్యాసిరాజు, కింతలి అమర్‌నాథ్‌లు మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారానికి తాము కూడా పార్వతీపురం వెళ్లి ఆమె విజయానికి కృషి చేస్తామన్నారు.


