భువనేశ్వర్: ఒడిశాలో అత్యంత అరుదైన పరిస్థితిలో ఓ శిశువు జన్మించింది. కంధమల్ జిల్లాకు చెందిన మహిళ బరంపురంలోని ఎంకేసీజీ వైద్య కళాశాల, ఆస్పత్రిలో రెండు తలలతో శిశువుకు జన్మనిచ్చింది. రెండు తలలు ఉన్నప్పటికీ, ఒకే శరీరం, ఒకే గుండె ఉండటం విశేషం. ప్రసవం అనంతరం శిశువును ఆసుపత్రిలోని ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగం (ఎస్ఎన్సీయూ)కు తరలించి, వైద్యుల నిరంతర పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. శ్వాస, హృదయ స్పందన రేటు సహా కీలక ఆరోగ్య సూచికలను వైద్య బృందం నిశితంగా పరిశీలిస్తోంది. ఈ అరుదైన పరిస్థితిని వైద్య పరిభాషలో ‘క్రానియోపాగస్ పారాసిటికస్’గా పేర్కొంటున్నారు.
మద్యం దుకాణం తరలించాలి
రాయగడ: తమ ప్రాంతంలో ఉన్న మద్యం దుకాణం వల్ల ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లాలోని గుణుపూర్ సమితి పరిధి రఘునాథ్నగర్కు చెందిన మహిళలు జిల్లా యంత్రాంగాన్ని ఆశ్రయించారు. ఇదే విషయమై పలుమార్లు సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎటువంటి స్పందన లేకపోవడంతో సోమవారం గుణుపూర్లో పర్యటించిన కలెక్టర్ అశుతోస్ కులకర్ణిని కలిసి సమస్యను విన్నవించుకున్నారు. మద్యం దుకాణాన్ని వేరేచోటుకు తరలించాలని కోరారు. దీనిపై పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
క్షేత్రస్థాయి సిబ్బంది చర్యలు కీలకం
భువనేశ్వర్: క్షేత్రస్థాయి సిబ్బంది చర్యలు ఉన్నత స్థాయి బాధ్యతను ప్రతిబింబిస్తాయి. భద్రతను కాపాడడంలో అసాధారణమైన అప్రమత్తత, సమయస్ఫూర్తి, విధిలపై నిబద్ధతను కనబర్చిన ముగ్గురు రైల్వే ఉద్యోగులను తూర్పు కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఫంక్వాల్ సత్కరించారు. ఈ సందర్భంగా ఖుర్దారోడ్ మండలం బొడొబొంధొ ట్రాక్ మెయింటెయినర్ శారదా ప్రసాద్ సాహూ, సంబల్పూర్ మండలం కంటాబంజి ట్రాక్ మెయింటెయినర్ త్రినాథ్ సెల్మా, మహాసముంద్ ట్రాక్ మెయింటెయినర్ శుభమ్ సా జనరల్ మేనేజరు సత్కారం పొందారు. రైలు రవాణా నిర్వహణలో కీలక పాత్ర పోషించే ముందంజ సిబ్బందిగా విధి నిర్వహణ రంగంలో వారి అప్రమత్తత, అంకితభావం, విధిపై నిబద్ధతను జనరల్ మేనేజరు ప్రశంసించారు.
మృతదేహం లభ్యం
మల్కన్గిరి: జిల్లాలోని కోరుకొండ సమితి బాలిమెలాలో స్థానిక పాత బస్టాండ్ వద్ద మంగళవారం మధ్యాహ్నం ఒక వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహం రాజా(37) అనే వ్యక్తిదిగా తెలిసింది. ఇతను గత కొన్ని నెలలుగా బాలిమెలా పట్టణంలోని పలు హోటల్స్లో రోజుకూలీగా పని చేస్తున్నాడు. అయితే రాజాకు మూర్చవ్యాధి ఉన్నట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని కోరుకొండ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈయన మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే మృతుడి వివరాలు తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నారేమోనని విచారిస్తున్నారు.


