తొక్కిసలాట: ‘అమ్మ నా ముందే ప్రాణాలొదిలింది’ | Durga Puja Stampede: Victim Families Share Their Pain | Sakshi
Sakshi News home page

తొక్కిసలాట: ‘అమ్మ నా ముందే ప్రాణాలొదిలింది’

Oct 18 2026 8:12 AM | Updated on Oct 18 2026 8:24 AM

Durga Puja Stampede: Victim Families Share Their Pain

కోల్‌కతా: శనివారం రాత్రి కోల్‌కతా నగరమంతా దేవీ నవరాత్రుల వెలుగులతో కళకళలాడుతోంది. పిల్లలు, పెద్దలు కొత్త బట్టలు కట్టుకుని, అమ్మవారి దర్శనం కోసం ఉత్సాహంగా అడుగులు వేస్తున్నారు. చోర్‌బగాన్ పూజా పండల్ వద్ద సందడి నెలకొంది. అయితే సరిగ్గా రాత్రి 7:40 గంటల సమయంలో ఆ ఆనందం ఒక్కసారిగా మృత్యుఘోషగా మారుతుందని అక్కడ ఉన్నవారెవరూ ఊహించలేదు. ఆకాశం ఒక్కసారిగా చిల్లులు పడ్డట్టు కుండపోత వర్షం మొదలైంది. దాని నుంచి తప్పించుకోవాలన్న ఆరాటం, తలదాచుకోవాలన్న తొందరలో బయట ఉన్న వేలాది మంది జనం ఒకేసారి మండపం లోపలికి చొచ్చుకు వచ్చేందుకు ప్రయత్నించారు. ఆ పెను ఒత్తిడికి పండల్ పైకప్పులోని ఒక భాగం కూలిపడటంతో ఒక్కసారిగా భయాందోళనలు చెలరేగాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తప్పించుకునే క్రమంలో మొదలైన తొక్కిసలాట చోటుచేసుకుంది. నిమిషాల వ్యవధిలోనే 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నరకయాతనను అనుభవించిన బాధితుల కన్నీటి గాథలు  హృదయాలను పిండేస్తున్నాయి.

‘కళ్లముందే అమ్మ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి’
కుమ్హర్‌టౌలీకి చెందిన సోనూ పాల్ తన కన్నతల్లితో కలిసి అమ్మవారి దర్శనానికి వచ్చాడు. వర్షం ప్రారంభం కాగానే పరిస్థితి అదుపుతప్పింది. ‘బయట భారీ వర్షం కురుస్తోంది. ఎవరూ బయటకు వెళ్లలేకపోయారు. వర్షానికి తడవకుండా ఉండటానికి ఎంట్రీ వద్ద నిలబడ్డ జనం వెనక నుంచి విపరీతంగా తోసుకుంటూ వచ్చారు. ఆ తోపులాటను ఎవరూ ఆపలేకపోయారు. జనం ఒకరిపై ఒకరు పడిపోయారు. ఆ గుట్టల కింద నేను కూడా ఊపిరాడక ఇరుక్కుపోయాను. ఎంతో శ్రమపడి, ఎలాగోలా ప్రాణాలు బిగబట్టి బయటకు వచ్చి పక్కనే ఉన్న అమ్మను చూశాను... కానీ అప్పటికే అమ్మ ప్రాణం పోయింది. నా కళ్లముందే నా అమ్మ నన్ను వదిలి వెళ్లిపోయింది’ అంటూ సోనూ గుండెలవిసేలా రోదిస్తున్న తీరు చూసి చుట్టుపక్కల వారి కళ్లు చెమ్మగిల్లాయి.

‘నా చెల్లెలు ఇక తిరిగి రాదు’
పండుగ పూట శుభమ్ సోన్‌కర్ కుటుంబంలో తీరని విషాదం చోటుచేసుకుంది. తన 30 ఏళ్ల సోదరిని ఆ తొక్కిసలాట మింగేసింది. ‘కుటుంబమంతా కలిసి నవ్వుతూ వచ్చాం. అందరం క్షేమంగానే తప్పించుకున్నాం కానీ, నా చెల్లెలు మాత్రం రాలేకపోయింది. ఆ రాక్షస తొక్కిసలాట నా సోదరిని మాకు కాకుండా చేసింది. ఇప్పుడు నా చెల్లి ఈ లోకంలోనే లేదు... దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు?’ అంటూ ఆయన పెట్టిన రోదన ఆసుపత్రి ప్రాంగణాన్ని కదిలించివేసింది.

ఆసుపత్రి మార్చురీల వద్ద రోదనలు
కోల్‌కతా మెడికల్ కాలేజీ, ఆసుపత్రి ప్రాంగణం రక్తమోడుతున్న గాయాలతో, కన్నవారిని, తోడబుట్టినవారిని కోల్పోయిన బంధువుల ఆర్తనాదాలతో దద్దరిల్లింది. మరణించిన 19 మందిలో 13 మంది స్త్రీలు, ఒక అమాయక చిన్నారి ఉండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ‘మేము మా వాళ్ల మృతదేహాలను తీసుకెళ్లడానికి వచ్చాం... కానీ మా కడుపుకోతకు ఎవరు సమాధానం చెబుతారు? ఆ సమయంలో పోలీసులు, అధికారులు ఎక్కడున్నారు? అంత పెద్ద ఉత్సవంలో రక్షణ వ్యవస్థ ఏమైంది?’ అంటూ బాధిత కుటుంబాల బంధువులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19కి చేరిన మృతుల సంఖ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement