● ఎనిమిదేళ్ల తర్వాత క్యాంపస్లలో ఎన్నికల సందడి
భువనేశ్వర్: ఎనిమిదేళ్ల విరామం తర్వాత ఒడిశా కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో జరిగిన విద్యార్థి సంఘ ఎన్నికలు ఉత్కంఠభరితంగా ముగిశాయి. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ), బీజూ ఛాత్ర జనతాదళ్ (బీసీజేడీ) మధ్య హోరాహోరీ పోరు, ఎన్ఎస్యూఐ పోటీతో క్యాంపస్లు ఎన్నికల సందడితో హోరెత్తాయి. ప్రచార హోరు, విందు వినోదాలు, ప్రత్యర్థులపై వాగ్యుద్ధాలు, అక్కడక్కడా ఘర్షణలు, ఓట్ల లెక్కింపులో ఉత్కంఠ.. ఇలా ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఎన్నికల పర్వం, విజేతల ప్రమాణస్వీకారాలు, విజయోత్సవాలతో ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కళాశాలలు, విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం ఎన్నికల్లో సమగ్రంగా 5,116 మంది అభ్యర్థులు ప్రత్యక్షంగా తలపడ్డారు.
అధ్యక్ష పదవుల కోసం హోరాహోరీ
ప్రధానంగా ఏబీవీపీ, బీసీజేడీ మధ్య అధ్యక్ష పదవుల కోసం తీవ్ర పోటీ నెలకొంది. అందుబాటులో ఉన్న ఫలితాల ప్రకారం, ఏబీవీపీ 142 కళాశాలల అధ్యక్ష పదవులను, బీసీజేడీ 121 పదవులను కై వసం చేసుకున్నాయి. ఐదు కళాశాలల్లో ఎన్ఎస్యూఐ అభ్యర్థులు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. పలు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు కూడా విజయం సాధించి తమ ఉనికిని చాటుకున్నారు.
అర్ధరాత్రి వరకు ఫలితాల ఉత్కంఠ
ఎనిమిదేళ్ల తర్వాత జరిగిన ఎన్నికలు కావడంతో క్యాంపస్లలో రాజకీయ సందడి నెలకొంది. విద్యార్థి సంఘాల ప్రచారాలు, ప్రత్యర్థుల మధ్య మాటల యుద్ధాలు, వర్గాల మధ్య ఘర్షణలు కొన్ని చోట్ల ఉద్రిక్తతలకు దారితీశాయి. రోడ్ల దిగ్బంధనాలు
చోటుచేసుకోవడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు పలు క్యాంపస్లలో ఉత్కంఠ కొనసాగింది. ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనలో జాప్యంతో అభ్యర్థులు, వారి మద్దతుదారులు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూశారు.
కీలక విద్యాసంస్థల్లో విజయాలు
రాజధాని భువనేశ్వర్లోని ఉత్కళ విశ్వవిద్యాలయంతో పాటు బీజేబీ కళాశాల, రాజధాని కళాశాల, సంబల్పూర్లోని గంగాధర్ మెహర్ విశ్వవిద్యాలయం తదితర విద్యాసంస్థల్లో కీలక పదవుల కోసం పోటీ ఆసక్తికరంగా సాగింది. ఉత్కళ విశ్వవిద్యాలయంలో అధ్యక్ష, కార్యదర్శి పదవులను ఏబీవీపీ కై వసం చేసుకున్నట్లు ఫలితాలు వెల్లడించాయి. భువనేశ్వర్ రమాదేవి మహిళా విశ్వవిద్యాలయంలో ఫలితాల ప్రకటన తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. సుదీర్ఘ జాప్యం అనంతరం తెల్లవారుజామున 2.35 గంటల సమయంలో ఫలితాలు వెలువడ్డాయి. అధ్యక్ష, ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, సంయుక్త ప్రధాన కార్యదర్శి సహా కీలక పదవులను బీసీజేడీ గెలుచుకుంది. కటక్ రెవెన్షా విశ్వవిద్యాలయం, ఫకీర్ మోహన్ విశ్వవిద్యాలయాల్లో ఏబీవీపీ, బీసీజేడీకి మిశ్రమ ఫలితాలు వచ్చాయి. శైలబాల కళాశాల, ఖల్లికోట్ కళాశాల, నిమాపడా కళాశాలల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు.
ప్రమాణస్వీకారాలతో ముగిసిన ఎన్నికల పర్వం
ఫలితాలు వెలువడటంతో విజేతల శిబిరాల్లో సంబరాలు అంబరాన్నంటాయి. మద్దతుదారులు నినాదాలు చేస్తూ, విజయోత్సవాలు నిర్వహిస్తూ సందడి చేశారు. మరోవైపు, కొత్తగా ఎన్నికై న విద్యార్థి నాయకులు శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. దీంతో ఎనిమిదేళ్ల విరామం తర్వాత ఒడిశా విద్యాసంస్థల్లో తిరిగి ప్రారంభమైన విద్యార్థి సంఘ ఎన్నికల పర్వానికి తెరపడింది.


