మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితిలోని గోపబంధు ప్రాంతీయ డిగ్రీ కాళాశాలలో ఎనిమిదేళ్ల తర్వాత ఈ నెల 15వ తేదీన నిర్వహించిన విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఎన్ఎస్యూఎల్ ఘన విజయం సాధించింది. రాత్రి తొమ్మిది గంటల తరువాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. అధ్యక్ష పదవికి ఎన్ఎస్యూఎల్ తరఫున పోటీ చేసిన ప్రణీత్ కుమార్ బిహారీ 217 ఓట్లు సాధించగా.. ఆయన సమీప ప్రత్యర్ధి కై లాష్ కుమార్ మాడీ 206 ఓట్లు పొందారు. దీనితో ప్రణీత్ ఎన్నికై నట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ప్రణీత్‌కు పలువురు అభినందనలు తెలియజేశారు.
ఉద్యోగ నియామక పత్రాలు అందజేత
మల్కన్‌గిరి: జిల్లా విద్యా పరిపాలనా వ్యవస్థను మరింత బలోపేతం చేసి సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో కీలక చర్య చేపట్టారు. ప్రభుత్వ ప్రజా సంక్షేమ విధానంలో భాగంగా మల్కన్‌గిరి జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో గురువారం పునరావాస సహాయ పథకం కింద ఏడుగురు అర్హులైన అభ్యర్థులకు అధికారికంగా నియామకపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి చిత్తరంజాన్ పాణిగ్రాహి హాజరై నూతన ఉద్యోగులకు అభినందనలు తెలియజేశారు.
సీనియర్ న్యాయవాది సునీల్ సాహు హఠార్మణం
కొరాపుట్: సీనియర్ న్యాయవాది సునీల్ సాహు (60) హఠాత్తుగా మరణించారు. శుక్రవారం నబరంగ్‌పూర్ పట్టణంలో మార్నింగ్ వాకింగ్ వెళ్లి తిరిగి వస్తుండగా తన నివాసం ముందు కుప్పకూలిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు జిల్లాకేంద్ర ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ వార్త తెలిసిన వెంటనే జిల్లా కోర్టుల సముదాయంలో సంతాప సభ నిర్వహించి కోర్టు సేవల నుంచి న్యాయవాదులు తప్పుకున్నారు.
దుస్తుల షోరూమ్‌లో
ఘోర అగ్ని ప్రమాదం
జయపురం: జయపురం ప్రధాన మార్గంలో గల ట్విల్స్ దుస్తుల దుకాణం, షోరూం గిడ్డంగిలలో నేడు అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది వెంటనే వచ్చి మంటలను అదుపులోకి తెచ్చి ప్రమాదాన్ని నియంత్రించారు. అయినా రూ.50 లక్షలకు పైగా విలువైన బట్టలు కాలి బూడిదైయినట్లు అంచనా. షోరూం తెరిచిన సమయంలో పై అంతస్తులో మంటలు ఎగిసి పడ్డాయి. అగ్ని మంటలను అదుపు చేసేందుకు స్థానికులు ప్రయత్నించిన ఫలితం లేకపోవటంతో వెంటనే అగ్నిమాపక విభాగానికి తెలియజేశారు. వెంటనే అగ్ని మాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని అనుమానిస్తున్నారు. ప్రమాదంలో షోరూం ఉద్యోగి ఒకరు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని జిల్లాకేంద్రాస్పత్రికి తరలించారు.


