కొరాపుట్: నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలు గుర్తు తెచ్చుకోవాలని మాజీ మంత్రి రమేష్ చంద్ర మజ్జి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం నబరంగ్పూర్ జిల్లా పపడాహండి సమితిలో ప్రతిపక్ష బీజేడీ పార్టీ నిర్వహించిన జన సంపర్క యాత్రనుద్దేశించి ప్రసంగించారు. సుమారు 24 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించిన నవీన్ పట్నాయక్ సంక్షేమ పథకాల అమలులో దేశంలో నంబర్–1గా నిలిచారన్నారు. అనేక రాష్ట్రాలు నవీన్ పాలనని ఆదర్శంగా తీసుకున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం నాటి సంక్షేమ పాలనను కొనసాగించలేకపోతోందని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదు సరికదా.. ఉన్న పథకాలు తీసివేశారని మండిపడ్డారు. కనీసం నెలవారి పెన్షన్లు ఇవ్వలేకపోతోందన్నారు. వరద బాధితులను ఆదుకోవడంతో తీవ్రంగా విఫలమయ్యారని మండిపడ్డారు. ఉచిత కరెంట్, మద్య నిషేధం తదితర హామీలపై మాట్లాడడానికి బీజేపీ నాయకులు సాహసించలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. అంతకుముందు బీజేడీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో డాబుగాం ఎమ్మెల్యే మనోహర్ రంధారి, మాజీ ఎంపీలు మున్నా ఖాన్, ప్రదీప్ మజ్జి, మాజీ ఎమ్మెల్యే సదాశివ ప్రదాని, జెడ్పీ ప్రెసిడెంట్ మెతిరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.


