జయపురం: జయపురం సబ్డివిజన్ బొరిగుమ్మ కమ్యూనిటీ ఆస్పత్రిలో రక్తదాన శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు. బొరిగుమ్మ సేవా సంకల్ప అభిజాన్, అమో ఒడిశాలు సంయుక్తంగా నిర్వహించిన శిబిరాకి పలువురు స్వచ్ఛందగా వచ్చి రక్తాన్ని దానం చేశారు. 41 యూనిట్ల రకాన్ని సేకరించినట్టు నిర్వాహకులు వెల్లడించారు. బొరిగుమ్మ కమ్యూనిటీ ఆస్పత్రి వైద్యాధికారి డాక్టర్ బసబొదత్త నాయిక్ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్త దాతలు ప్రాణ దాతలన్నారు. సకాలంలో రక్తం లభ్యం కాక అత్యవసర సమయాల్లో చాలామంది మృత్యువాత పడుతున్న ఘటనలు ఉన్నాయన్నారు. రక్తం కొరతతో ఏ ఒక్కరూ మృత్యువాత పడకుండా ఉండాలంటే ప్రతిఒక్కరూ రక్తదానం చేయాలన్నారు. రక్తదాన శిబిరంలో బొరిగుమ్మ నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్ (ఎన్ఏసీ) చైర్మన్ నందకేశ్వర మిశ్ర, మాజీ సామాజిక భద్రతాధికారి కార్తీక పాఢి, అదనపు బీడీవో నివేదిత దండసేన, సీడీపీవో సబితారాణి బ్రహ్మ, బొరిగుమ్మ ఆస్పత్రి బీపీఎం హేమలత పాణిగ్రహి, పీహెచ్ఈవో సునీత పట్నాయక్, సౌరభ మహంకుడో ఉన్నారు. వైద్య సిబ్బంది, సంబాద దిన పత్రిక ప్రతినిధి అమరేంద్రపరచతో పాటు బొరిగుమ్మ యువజన సంఘ ప్రతినిధులు సహకరించారు. రక్తదాతలకు ఆస్పత్రి అధికారులు అతిథులతో కలిసి ప్రశంసా పత్రాలు అందజేశారు.


