మల్కన్గిరి: జిల్లాలోని చిత్రకొండ సమితి కేంద్రంలో ఉన్న ఎస్ఎస్డీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థినిపై తోటి విద్యార్థినులు దాడి చేశారు. వివరాల్లోకి వెళ్తే.. సబ్బు అడిగినందుకు గొడవ ప్రారంభమై కొట్టుకునేవరకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ గొడవలో పదో తరగతి విద్యార్థినికి తీవ్రగాయాలయ్యాయి. అయితే ఘటన జరిగి మూడు రోజులైనా హాస్టల్ సిబ్బంది అధికారులకు తెలియజేయలేదు. దీనిపై శుక్రవారం విద్యార్థిని తల్లిదండ్రులు వచ్చి తమ బిడ్డపై దాడి చేశారని ఫిర్యాదు చేయడంతో విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది. విద్యార్థినిపై 8వ తరగతి చదువుతున్న ఏడుగురు విద్యార్థినులు దాడి చేశారు. గాయాలపాలైన బాలికను పాఠశాల సిబ్బంది చిత్రకొండ ఆరోగ్య కేంద్రానికి గురువారం తీసుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న చిత్రకొండ సమితి అధ్యక్షురాలు రాజేశ్వరి ఖీలో ఆరోగ్య కేంద్రానికి వెళ్లి బాలికను పరమర్శించారు. దీనిపై జిల్లా సంక్షేమ అధికారి శ్రీనివాస్ ఆచారి స్పందిస్తూ ఏడుగురు విద్యార్థినులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


