● నలుగురు అరెస్టు
భువనేశ్వర్: స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెనన్స్ (డీఆర్ఐ), కస్టమ్స్ అధికారుల తనిఖీలో శనివారం విలువైన హైడ్రోపోనిక్ గంజాయి అక్రమ రవాణా గుట్టు రట్టు అయింది. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ సుమారు రూ.1.85 కోట్లు పలుకుతుందని అంచనా. బ్యాంకాక్ నుంచి వచ్చిన నలుగురు ప్రయాణికుల లగేజీ తనిఖీలో సమగ్రంగా 5.291 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో బ్యాంకాక్ నుంచి వచ్చిన నలుగురు వ్యక్తులను భువనేశ్వర్ ప్రాంతీయ డీఆర్ఐ విభాగం అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కస్టమ్స్ అధికారుల సమన్వయంతో సోదాలు నిర్వహించారు. అధికార వర్గాల సమాచారం ప్రకారం 3 మంది ప్రయాణికుల చెక్–ఇన్ బ్యాగేజీ తనిఖీ చేస్తుండగా, ప్రత్యేకంగా రూపొందించిన రహస్య అరలలో దాచి ఉంచిన అనుమానాస్పద ప్యాకెట్లను గుర్తించారు. సాధారణ పనిముట్లతో ఆ అరలను తెరవడంతో 6 ప్యాకెట్లలో 4.877 కిలోల ఆకుపచ్చ రంగు పదార్థం బయయటపడింది. నాల్గో ప్రయాణికుని వ్యక్తిగత తనిఖీ సమయంలో డీఆర్ఐ అధికారులు డాగ్ ఫుడ్ అని రాసి ఉన్న ఒక టిన్ డబ్బాను గమనించారు. ఆ డబ్బాకు సంబంధించి ప్రయాణికుడు వివరణ అసంతృప్తికరంగా తారసపడడంతో అనుమానంతో నిర్ధారణ కోసం లోతుగా పరిశీలించారు. ఈ సన్నాహంలో భారత కస్టమ్స్ కె–9 బృందానికి చెందిన రూబెల్ అనే డిటెక్టర్ డాగ్ సహాయంతో రూబెల్ను మొదట మరో ప్రయాణికుడి సామాను నుంచి స్వాధీనం చేసుకున్న సందిగ్ధ మాదకద్రవ్యం పరిశీలన చేపట్టారు. ఆ డబ్బాలో అనుమానిత మాదకద్రవ్యాల వాసనను పోలిన పదార్థం ఉందని డిటెక్టర్ డాగ్ రూబెల్ సూచన ఇచ్చింది. ఆ సూచనను అనుసరించి డీఆర్ఐ అధికారులు ఆ డబ్బాను తెరవడంతో మరో 0.414 కిలోల ఆకుపచ్చ రంగు పదార్థం బయటపడింది. ఇలా బ్యాంకాక్ నుంచి వచ్చిన నలుగురు ప్రయాణికుల నుంచి 5.291 కిలోల హైడ్రోపోనిక్ స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న నిషేధిత పదార్థాలతో నిందిత ప్రయాణికులను తదుపరి చట్టపరమైన చర్యల కోసం భువనేశ్వర్ కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్న్స్ యూనిట్ (ఏఐయూ)కి అప్పగించారు.


