రాష్ట్రపతి, ప్రధాన మంత్రి పర్యటనకు సన్నాహాలు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి, ప్రధాన మంత్రి పర్యటనకు సన్నాహాలు

Oct 18 2026 1:12 AM | Updated on Oct 18 2026 1:12 AM

భువనేశ్వర్‌: ఈ నెలలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనకు విచ్చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రఽముఖ కార్యదర్శి అనూ గర్గ్‌ అధ్యక్షతన లోక్‌ సేవా భవన్‌లో శనివారం రాష్ట్ర స్థాయి సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర హోం, సమాచార, పౌర సంబంధాల శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి హేమంత్‌ శర్మ రాష్ట్రపతి, ప్రధాన మంత్రి పర్యటన కార్యక్రమాలకు సంబంధించిన వివరాల్ని తెలియజేశారు. అక్టోబర్‌ 28, 29 తేదీలలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒడిశాలో పర్యటించనున్నారు. ఆమె మయూర్‌భంజ్‌ జిల్లాలో పలు కార్యక్రమాలలో పాల్గొంటారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్‌ 25న ఖుర్దా సమీపంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా డేటా సెంటర్‌, శిక్షణా సంస్థను ప్రారంభించి తిరిగి వెళ్తారు. ప్రధాన మంత్రి 25వ తేదీ మధ్యాహ్నం ప్రత్యేక వైమానిక దళ విమానంలో భువనేశ్వర్‌ విమానాశ్రయానికి చేరుకుని, సూర్యాస్తమయానికి ముందే ప్రత్యేక హెలికాప్టర్‌లో ఖుర్దా హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి ఆయన రోడ్డు మార్గంలో ఖుర్దా జిల్లాలో ఆర్‌బీఐ గ్రీన్‌ ఫీల్డ్‌ డేటా సెంటర్‌, శిక్షణా కేంద్రాన్ని ప్రారంభిస్తారు. అక్కడ ప్రధాన మంత్రి సుమారు 1 గంట పాటు కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం రోడ్డు మార్గంలో భువనేశ్వర్‌ విమానాశ్రయానికి చేరుకుని తిరిగి ఢిల్లీకి బయల్దేరుతారు. ప్రధానమంత్రి పర్యటన దృష్ట్యా, భద్రతా ఏర్పాట్లు, ఆకస్మిక ప్రణాళికలు, అత్యవసర వైద్య సేవలు, అవసరమైన రహదారి మరమ్మతులు, పారిశుధ్యం, నిరంతర విద్యుత్‌ సరఫరా, తాగునీటి సరఫరా, వేదిక సన్నద్ధత, మీడి యా సమావేశం, ఇతర సంబంధిత ఏర్పాట్లతో సహా ప్రధాన మంత్రి పర్యటన సన్నాహాలపై సవివరంగా చర్చించారు.

రాష్ట్రపతి పర్యటన కార్యక్రమాలు

అక్టోబర్‌ 28, 29 తేదీల్లో రాష్ట్రపతి ముర్ము రెండు రోజులపాటు హాజరుకానున్న వివిధ కార్యక్రమాల సన్నాహాలపై ఈ సమావేశంలో చర్చలు జరిపారు. రాష్ట్రపతి 28వ తేదీ ఉదయం మయూర్‌భంజ్‌ జిల్లాలోని బహల్దాలో ఉన్న కిచ్‌కేశ్వరి మాత ఆలయానికి రోడ్డు మార్గంలో వెళ్లి పూజాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం రాయరంగపూర్‌లోని మహుల్దిహాలో ఉన్న లక్ష్మీ మండపాన్ని సందర్శించి ప్రార్థనలు చేస్తారు. మధ్యాహ్నం పూట రాయ్‌రంగ్‌పూర్‌ సబ్‌ డివిజనల్‌ ఆస్పత్రిని సందర్శించి అధికారులు, సిబ్బందితో సమావేశం అవుతారు. ఆ తర్వాత రాయరంగ్‌పూర్‌ కచేరీ రోడ్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొని, వర్చువల్‌ విధానంలో ఐఐఎఫ్‌ఎం (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ మేనేజ్‌మెంట్‌) క్యాంపస్‌కు శంకుస్థాపన చేస్తారు. కేంద్ర పర్యాటక శాఖ ఆమోదించిన ప్రసాద్‌ పథకం కింద ఖిచింగ్‌లోని కిచ్‌కేశ్వరి మాత ఆలయ పునరుద్ధరణ, ఉన్నతీకరణకు శంకుస్థాపన చేస్తారు. కొత్తగా నిర్మించిన రాయరంగ్‌పూర్‌, బాదం ఝర్‌ అమృత్‌ భారత్‌ రైల్వే స్టేషన్లను ప్రారంభించి, గోశాల, గిరిజన సామాజిక విద్యా మరియు సాంస్కృతిక సంఘం భవనానికి శంకుస్థాపన చేస్తారు. 29వ తేదీ ఉదయం రాష్ట్రపతి రాయరంగపూర్‌లోని స్పోర్ట్సు కాంప్లెక్స్‌, బహుళార్ధసాధక నైపుణ్యాభివృద్ధి కేంద్రం, గోరు మహిసాని స్టీల్‌ కళాశాలను సందర్శిస్తారు. రాయరంగపూర్‌ టౌన్‌ హాల్‌లో ఆరోగ్య శాఖకు సంబంధించిన చర్చలు, సమావేశాలు, అవగాహన కార్యక్రమాలలో పాల్గొంటారు. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి పర్యటనకు సంబంధించి రాష్ట్ర హోం శాఖ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయనున్నట్లు సమావేశంలో తెలియజేశారు. సమావేశానికి అభివృద్ధి కమిషనర్‌, అదనపు ప్రధాన కార్యదర్శి దేవ్‌ రంజన్‌ కుమార్‌ సింగ్‌, ఖుర్దా జిల్లా కలెక్టర్‌, వివిధ సంబంధిత శాఖల కార్యదర్శులు, రాష్ట్ర డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అధికారులు, వివిధ సంబంధిత సంస్థల అధికారులు హాజరయ్యారు. సెంట్రల్‌ ఆర్డీసీ, మయూర్‌భంజ్‌ జిల్లా కలెక్టర్‌ మరియు ఎస్పీ వర్చువల్‌ విధానంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement