● పంచాయతీ ఎన్నికలకు ఆంధ్రా నోటిఫికేషన్
కొరాపుట్: ఆంధ్రా–ఒడిశా వివాదాస్పద ప్రాంతం కొఠియాపై ఒడిశా ప్రభుత్వం డైలామా లో పడింది. కొరాపుట్ జిల్లా పొట్టంగి సమితి కొఠియా గ్రామ పంచాయతీలో 21 వివాదాస్పద గ్రామాలకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. దాంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఆంధ్ర ప్రదేశ్లోని పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం గంజాయి బద్ర, పగులు చెన్నురు ఎంపీటీసీ గ్రామాలకు నవంబర్ 3వ తేదీ పోలింగ్ జరగనుంది. గంజాయి బద్ర, పట్టు చెన్నురు, పగులు చెన్నురు, కురకుట్ల, సారిక గ్రామ పంచాయతీలకు నవంబర్ 26, 29 తేదీల్లో పోలీంగ్ జరగనుంది. అందుకు ఆదేశాలు జారీ అయ్యాయి.
భగ్గుమన్న రాజకీయ పార్టీలు
ఈ నోటిఫికేషన్ పై ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ మండి పడ్డారు. ఒడిశా ముఖ్యమంత్రి కొఠియా పై పోరాటం చేయలేదన్నారు. ప్రస్తుత సమస్య పై తామ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం చేస్తామన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు. మరో వైపు అధికార బీజేపీకి చెందిన కొరాపుట్ ఎమ్మెల్యే రఘురాం మచ్చో స్పందించారు. కొఠియాలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించలేదన్నారు. కోర్టులో ఉన్న విషయం గమనించాలన్నారు. మరో వైపు కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉల్క, సీఎల్పీ నాయకుడు రాంచంద్ర ఖడం, జయపూర్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహిణీపతిలు కొఠియా ప్రాంతంలో ఆది వారం పర్యటించనున్నారు.
కొఠియా వివాదం
బ్రిటిష్ పాలనా కాలం నుంచి కొఠియా వివాదం నడుస్తోంది. ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో కొఠియా కి చెందిన 21 గ్రామాలు ఉన్నాయి. బ్రిటిష్ మ్యాప్లు ప్రకారం ఈ గ్రామాలు రెండు రాష్ట్రాల్లో ఉండడం గమనార్హం. దాంతో వివాదం ప్రారంభమైంది. ఇరు రాష్ట్రాలు సుప్రీంను ఆశ్రయించాయి. సుప్రీం కోర్టు కొఠియా లో స్టేటస్ కో విధించింది. ఆ ఆర్డర్ ప్రకారం తుది తీర్పు వచ్చే వరకు యథాతథ స్థితిగా ఉండాలని ఆదేశించింది. దాంతో ఎన్నికల సమయంలో ఈ గ్రామాల ప్రజలు రెండు రాష్ట్రాల్లో ఓట్లు వేస్తారు. అందుకు తగ్గ విధంగా ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పని చేస్తారు. అత్యధిక ప్రజలకు రెండు రాష్ట్రాల రేషన్ కార్డులు, పింఛన్లు, సంక్షేమ పథకాలు అందుతాయి. కానీ కొఠియా పై ఒడిశా రాష్ట్రం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆయా గ్రామాల్లో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్ర నోటిఫికేషన్ మరో వివాదంగా మారింది.


