స్వచ్ఛంద రక్తదానం..
● ప్రతి వ్యక్తి జీవితంలో 168 సార్లు రక్తదానం చేయవచ్చు ● నేడు జాతీయ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవం
● రక్తదానానికి ముందురోజు
సరిపోయినంత నిద్రపోవాలి.
● ఆరోగ్యకరమైన భోజనం తినాలి.
● పుష్కలంగా నీరు తాగాలి.
శ్రీకాకుళం కల్చరల్: ప్రమాదంలో కొట్టుమిట్టాడుతున్న ప్రాణానికి.. ఆపదలో ఉన్న రోగికి.. ప్రసవ సమయంలో తల్లికి రక్తం అవసరమైన వేళ అందించే ప్రతి రక్తపు బొట్టూ ఒక కొత్త ఆశను నింపుతుంది. ప్రతిఫలం ఆశించకుండా రక్తదానం చేసే దాత.. తన రక్తంతో తెలియని వ్యక్తికి జీవితాన్ని అందించే నిజమైన ప్రాణదాత. రక్తం శరీరంలో సరిపడినంతలేక ప్రాణాలు పోగొట్టుకున్నవాళ్లు ఎందరో ఉన్నారు. రూ.కోట్లు ఖర్చు చేసినా రక్తం దొరకని పరిస్థితి కూడా ఉంటుంది. అలాంటి ఆపద సమయాల్లో ఆదుకునే రక్తదాతల కోసం ఐక్యరాజ్య సమితి ఒకరోజును కేటాయించింది. అక్టోబర్ 1న జాతీయ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవంగా గుర్తింపునిచ్చింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ రక్తదానంపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది.
జిల్లాలో పరిస్థితి...
మన జిల్లాకు అవసరమైన రక్త సేకరణ కావాల్సినంతగా జరగడం లేదు. జిల్లాలో 25 లక్షలకుపైగా జనాభా ఉండగా.. కనీసం 25 వేల యూనిట్ల రక్తం ప్రతి ఏడాది అవసరం అవుతుంది. కానీ జిల్లాలోని అన్ని బ్లడ్ బ్యాంకుల ద్వారా కేవలం 8 వేల నుంచి 10 వేల యూనిట్లు మాత్రమే సేకరణ జరుగుతోంది. గతేడాది కంటే రక్త సేకరణ శిబిరాలు పెరిగినా అవసరానికి సరిపోవడం లేదు. రెడ్‌క్రాస్‌లో గత ఏడాది డిసెంబర్ వరకు 4,800 యూనిట్లు సేకరించగా, ఈ ఏడాది జనవరి నుంచి ఈనెల వరకు 81 రక్తదాన శిబిరాల ద్వారా 3,500 యూనిట్లు సేకరించడం జరిగింది.
రక్త నిల్వ కేంద్రాలు
రక్తాన్ని సేకరించేందుకు ప్రత్యేకంగా బ్లడ్ బ్యాంకులను ఏర్పాటు చేశారు. జిల్లాలో అతి పెద్ద రక్త నిల్వకేంద్రంగా శ్రీకాకుళం రెడ్‌క్రాస్ నిలుస్తుంది. రక్తదాతలు ఎవరైనా ముందుకు వస్తే 91330 08585 నంబరుకి కాల్ చేయాలి. వీరు సేకరించిన రక్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్, పాతపట్నం, టెక్కలి, పాలకొండల ప్రభుత్వ ఆస్పత్రులకు అందిస్తున్నారు.
అపోహలు వీడాలి
చాలా మందికి రక్తదానం అంటే భయం, అపోహలు ఉన్నాయి. రక్తం గురించి తెలుసుకుంటే ఆ భయం పోతుంది. రక్తదాన ప్రక్రియలో కేవలం మన శరీరం నుంచి 300 మి.లీ మాత్రమే స్వీకరిస్తారు. సాధారణంగా మనిషిలో సరాసరి 5 లీటర్ల నుంచి 6 లీటర్ల రక్తం ఉంటుంది. కేవలం 300 మి.లీ రక్తం దానం చేయడం వలన ఎటువంటి ప్రమాదం లేదు. ప్రమాదం జరిగినప్పుడు లీటరు వరకు రక్తం పోతుంది. సుఖ ప్రసవంలో తల్లి 700 మి.లీ రక్తం కోల్పోతుంది. ఆరోగ్యంగా ఉన్న 18 ఏళ్లు పైబడినవారందరూ రక్తదానం చేయవచ్చు. 18 ఏళ్లు నుంచి క్రమం తప్పక రక్తదానం చేయగలిగితే జీవితకాలంలో మొత్తం 168 సార్లు రక్తదానం చేయవచ్చు.
మధుమేహ వ్యాధిగ్రస్తులు.
గుండెకు శస్త్ర చికిత్స చేయించుకున్నవారు.
క్యాన్సర్ శస్త్ర చికిత్స చేయించుకున్నవారు.
గుండెపోటుకు గురైనవారు.
మూర్చవ్యాధి ఉన్నవారు.
ఎయిడ్స్, హెపటైటిస్–బీ, హెపటైటిస్–సీ, సిఫిలిస్ లాంటి అంటువ్యాధులు ఉన్నవారు.
దీర్ఘకాలిక కిడ్నీవ్యాధి ఉన్నవారు.
ఆటో ఇమ్యూస్ డిజార్డర్స్ ఉన్నవారు.


