పర్లాకిమిడి: పట్టణంలో అగ్రగామి సాంస్కృతిక సంస్థ సమలై నృత్యకళా పరిషత్, ఒడిశా ప్రభుత్వ ఒడియా భాష, సంస్కృతి విభాగం సంయక్తంగా ఏర్పాటుచేసిన 21వ జిల్లా స్థాయి నువాఖయి భేట్‌ఘాట్ 2026 స్థానక టౌనుహాలులో ఆదివారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమాన్ని పురపాలక సంఘం అధ్యక్షురాలు నిర్మలా శెఠి ప్రదీప ప్రజ్వల్లన చేసి ప్రారంభించారు. గౌరవ అతిథిగా జిల్లా సాంస్కృతిక శాఖ అధికారిని అర్చనా మంగరాజ్, సంగీత దర్శకులు, నాటక అకాడమీ సభ్యులు రఘునాథ పాత్రో, నాటక కళాకారులు ఆదర్శదాస్, సంస్థ అధ్యక్షులు నృసింహా చరణ్ పట్నాయిక్ తదితరులు పాల్గొన్నారు. సమలై సంస్థ కార్యదర్శి బాలకృష్ణ పాణిగ్రాహి వార్షిక సంపాదకీయం చదివి వినిపించారు. పశ్చిమ ఒడిశాలో అతి ముఖ్యమైన పండుగ నువాఖయి గత రెండేళ్లుగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా శ్రీజగన్నాధ ఒడిస్సీ కళాకేంద్రం, పదామృత నృత్యనయన, మిరాకిల్ డ్యాన్స్ స్టూడియో విద్యార్థులు పాల్గొనగా, సమలై నృత్య అకాడమీ నృత్య ప్రదర్శనను పర్యవేక్షించారు. సంబల్‌పురి నృత్యాలను ప్రముఖనృత్య కళాకారిణి డి.ప్రియాంక, రఘునాథ పట్నాయిక్, డి.మోహాన్ రావులు పర్యవేక్షణలో ప్రేక్షకులను అలరింపజేశారు. ఈ ప్రదర్శన చూడటానికి రాత్రి 12గంటల వరకూ ప్రేక్షకులు నిరీక్షించారు.


