పర్లాకిమిడి: ప్రధానమంత్రి సూర్యఘర్, ఉచిత విద్యుత్ పథకాన్ని కలెక్టరేట్ వద్ద జిల్లా పాలనాధికారి లాంఛనంగా మంగళవారం ప్రారంభించారు. అనంతరం ప్రజలందరికీ తెలిసేలా ఒక సంచార వాహనాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద కనీసం రూ.1,875లు కట్టిన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఇంటి రూఫ్‌పై 1 కిలోవాట్ సోలార్ ప్యానల్ అమర్చుతారు. అలాగే 3 కిలోవాట్ విద్యుత్ కోసం సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం రూ.78 వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.60 వేలు విడుదల చేస్తుంది. కార్యక్రమంలో పీఎం సూర్యఘర్ చీఫ్ ఆపరేషన్ మేనేజర్ మిలింద్ కులకర్ణి, టాటా పవర్ సదరన్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ సీఈవో అమిత్ గార్గ్ తదితరులు పాల్గొన్నారు.
దేవగడ్ జిల్లాలో భూ ప్రకంపనలు
భువనేశ్వర్: దేవగడ్ జిల్లాలో సోమవారం రాత్రి 3.9 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం (ఎన్‌సీఎస్) తెలిపింది. పొరుగున ఉన్న అనుగోల జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భూ ప్రకంపనలు సంభవించాయి. 21.179ని ఉత్తర అక్షాంశం మరియు 84.774ని తూర్పు రేఖాంశం వద్ద 20 కిలోమీటర్ల లోతున భూ ప్రకంపనం కేంద్రీకృతమైనట్లు భూకంప శాస్త్ర సంస్థ తెలిపింది. దేవ్‌గడ్ జిల్లాలోని ఛధైమొర, బర్‌కోట్, దేవ్‌గఢ్, కుంధైగొలా, రియామల్ సహా పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. అనుగోల జిల్లాలోని ఖమర్, పటక్‌ముండా, కోశల, బగాడియా సహా కొన్ని ప్రాంతాల్లో, ఛెండీపొదా మండలంలోని కొన్ని భాగాల్లో కూడా భూ ప్రకంపనలు సంభవించాయి. ప్రాణనష్టం లేదా భవన తదితర ఆస్తి నష్టంకు సంబంధించి ఎటువంటి అధికారిక సమాచారం లేదు. భూమి అకస్మాత్తుగా కదలడంతో ప్రభావిత ప్రాంతాల్లోని నివాసితులలో కొద్దిసేపు భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో కొందరు ముందు జాగ్రత్త చర్యగా తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
ఆర్థిక లోపాలు ఎత్తిచూపిన కాగ్
భువనేశ్వర్: రాష్ట్ర ప్రభుత్వంలోని కీలక శాఖల్లో విధానపరమైన ఆర్థిక లోపాలను భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఎత్తి చూపింది. తక్కువ పన్నుల వసూలు, ప్రాజెక్టుల అమలులో జాప్యం వంటి అనేక అవకతవకలు, అమలు లోపాలను కాగ్ గుర్తించింది. నీటి పారుదల, గనుల తవ్వకం, మత్స్య, అటవీ, ఇతర రంగాల్లో నిర్వీర్యం అయిన నిధుల వ్యయంపై పెదవి విరిచింది. భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం గవర్నర్‌కు సమర్పించడం కోసం సీఏజీ 2023–24 ఆర్థిక సంవత్సరానికి ఈ నివేదికను సిద్ధం చేసింది. మత్స్య, పశు వనరుల అభివృద్ధి, అటవీ, పర్యావరణం, వాతావరణ మార్పు, ఉక్కు, గనులు, జల వనరులు, నిర్మాణాలు తదితర శాఖల ఆర్థిక విధానాలను విశ్లేషించింది. భూసేకరణ, అటవీ అనుమతులు లేకుండా జలవనరుల శాఖ 38 చిన్న నీటి పారుదల ప్రాజెక్టులను కేటాయించడంతో రూ.91.57 కోట్ల వ్యయం వృథా అయినట్లు ఆడిట్‌లో తేలింది. ఓసీసీఎల్‌కు ఆకస్మిక ఖర్చుల కింద ఆమోదయోగ్యం కాని రూ.6.49 కోట్లు చెల్లించడంతో పాటు ఆ సంస్థకు విడుదల చేసిన రూ.510.19 కోట్ల అడ్వాన్సులపై రూ. 67.54 కోట్ల వడ్డీని వసూలు చేయలేదని కాగ్ గుర్తించింది.
బస్టాండ్‌లో సౌకర్యాలు కల్పించాలి
జయపురం: స్థానిక నూతన బస్టాండ్‌లో ప్రయాణికులకు కనీస మౌలిక సౌకర్యాలు కల్పించాలని జయపురం సీనియర్ సిటిజన్ కమిటీ డిమాండ్ చేసింది. స్థానిక సీనియర్ సిటిజన్ కమిటీ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో పట్టణ సమస్యలపై.. ముఖ్యంగా నూతన బస్టాండ్‌లో సమస్యలు, పాత బస్టాండ్‌లో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. ముఖ్యంగా బస్టాండ్‌లో వయో వృద్ధులు కూర్చొనేందుకు సౌకర్యాలు కల్పించాలని, టిక్కెట్టు కౌంటర్ల వద్ద వయో వృద్ధులకు మొదటి ప్రాధాన్యత కల్పించాలని కోరారు. సమావేశంలో ప్రకాశ్ కుమార్ సాహు, నవీన మహాపాత్రో, బాలకృష్ణ సాహు, సురేంద్ర కుమార్ సాహు, రోహిత్ రంజన్ సాహు తదితరులు పాల్గొన్నారు.


