రాయగడ మున్సిపాలిటీ వైస్
చైర్‌పర్సన్‌గా శ్రమిత పాడి
ఒకరే నామినేషన్ వేయడంతో ఎన్నిక ఏకగ్రీవం
అనంతరం బీజేడీ నుంచి సస్పెన్షన్
రాయగడ: ఎట్టకేలకు రాయగడ మున్సిపాలిటీ వైస్ చైర్‌పర్సన్ పదవికి ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. 16వ వార్డు కౌన్సిలర్ శ్రమిత పాడి ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన తహసీల్దార్ ప్రియదర్శిని స్వయి ప్రకటించారు. వైస్ చైర్‌పర్సన్ పదవికి మంగళవారం జరిగిన ఎన్నికలో మొత్తం 24 వార్డులకు గాను 20 వార్డులకు చెందిన కౌన్సిలర్లు ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. 11 గంటల నుంచి 12 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అధికారులు సమయం కేటాయించారు. అయితే శ్రమిత పాడి మాత్రమే నామినేషన్ దాఖలు చేయడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ప్రకటించారు. 20 మంది కౌన్సిలర్లు ఆమెకు మద్దతు ఇవ్వడంతో పాటు ఇందులో 24వ వార్డుకు చెందిన కాంగ్రెస్ కౌన్సిలర్ రాజీవ్ ఖొసల కూడా శ్రమిత పాడికి మద్దతు పలకడం విశేషం.
గతేడాది ఆవిశ్వాస తీర్మానం
గతేడాది సెప్టెంబర్ 12వ తేదీన మున్సిపాలిటీ వైస్ చైర్‌పర్సన్ శుభ్ర పండపై 19 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు. అనంతరం అవిశ్వాస తీర్మానంకు సంబంధించి జరిగిన ఓటింగ్‌లో శుభ్రపండకు వ్యతిరేకంగా 19 మంది కౌన్సిలర్లు తమ అభిప్రాయాన్ని ఓటింగ్ ద్వారా వ్యక్తపరిచారు. అయితే న్యాయపరమైన ప్రక్రియ, హైకోర్టు ఆదేశాల మేరకు అప్పట్లో ఫలితాలను ప్రకటించలేదు. చివరకు హైకోర్టు ఆదేశాలతో ఈ ఏడాది మార్చి 11న అవిశ్వాస తీర్మానంపై జరిగిన ఫలితాలను ప్రకటించారు. దీంతో వైస్ చైర్‌పర్సన్ పదవి ఖాళీ అయ్యింది.
అభినందనలు
వైస్ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై న శ్రమిత పాడీని కౌన్సిలర్లు, ఆమె మద్దతుదారులు అభినందించారు. అనంతరం స్థానిక రాణిగుడఫారంలోని రాజ్యసభ మాజీ ఎంపీ నెక్కంటి ఇంటికి చేరుకున్న శ్రమిత పాడి, ఇతర కౌన్సిలర్లు ఆయన ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. మాజీ మంత్రి లాల్‌బిహారి హిమిరక, సమితి చైర్మన్ టున్ని హుయిక, వైస్ చైర్మన్ హరప్రసాద్ హెప్రుక, బిజూ స్వాభిమాన్ మంచ్ అభిమానులు, మద్దతుదారులు శ్రమిత పాఢి విజయంపై తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. బీజేడీ పార్టీ తరుపున గత మున్సిపాలిటీ ఎన్నికల్లో రాయగడ మున్సిపాలిటీ చైర్మన్ మహేష్ పట్నాయక్, శ్రమిత పాఢి కౌన్సిలర్‌గా విజయం సాధించిన సంగతి తెలిసిందే.
బీజేడీ నుంచి సస్పెండ్
రాయగడ మున్సిపాలిటీ చైర్మన్ మహేష్ పట్నాయక్, వైస్ చైర్‌పర్సన్ శ్రమిత పాఢిలను బీజేడీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర శాఖ కార్యదర్శి బిజయ్ నాయక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శంఖ భవనం నుంచి ఈ మేరకు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. బీజేడీలో ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటనలో వివరించారు.


