ఎం.ఎం.డి.ఆర్‌తో హక్కులు హరించే ప్రయత్నం | - | Sakshi
Sakshi News home page

ఎం.ఎం.డి.ఆర్‌తో హక్కులు హరించే ప్రయత్నం

Sep 22 2026 1:12 AM | Updated on Sep 22 2026 1:12 AM

29 అసెంబ్లీ ఎదుట నిరసన

పీసీసీ అధ్యక్షుడు భక్తచరణ్‌ దాస్‌

రాయగడలో ఇండియా కూటమి పరివర్తన ర్యాలీ

రాయగడ: ఎం.ఎం.డి.ఆర్‌ సవరణ చట్టం–2026ను రద్దు చేయకపోతే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని పీసీసీ అధ్యక్షుడు భక్త చరణ్‌ దాస్‌ హెచ్చరించారు. ఇండియా కూటమి ఆధ్వర్యంలో సోమవారం పరివర్తన్‌ పేరిట భారీ ర్యాలీ, బహిరంగ సభను నిర్వహించారు. కొరాపుట్‌ పార్లమెంటు సభ్యుడు సప్తగిరి శంకర్‌ ఉలక నాయకత్వంలో జరిగిన కార్యక్రమానికి కాంగ్రెస్‌తో పాటు సీపీఐ, సీపీఎం, సీపీఐ (ఎంఎల్‌) లిబరేషన్‌, సమాజ్‌వాది పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. స్థానిక తేజస్వీ మైదానంలో ఈ మేరకు జరిగిన బహిరంగ సభలో పీసీసీ చీఫ్‌ భక్త చరణ్‌ దాస్‌ మాట్లాడుతూ.. ఎంఎండీఆర్‌ సరవణ చట్టాన్ని నల్ల చట్టంగా అభివర్ణించి దాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సుప్రీంకోర్టు 2024 జూలై 25న ఇచ్చిన తీర్పు ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఖణిజా సంపదపై పన్నులు, రాయల్టీలు వసూలు చేయవచ్చన్నారు. 2005 నుంచి 2024 వరకు బకాయిలను కూడా వసూలు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి గత బాయిల రూపంలో సుమారు రూ. 1.10 లక్షల కొట్లు, 2024 నుంచి ఏటా కనీసం 20 వేల కోట్ల రుపాయలు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అన్నారు. అయితే ఈ ఆదాయ హక్కులను నిర్వర్యం చేసే విధంగా కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఎంఎండీఆర్‌ సవరణ చట్టం–2026ను తీసుకువచ్చిందని అన్నారు. దీనివల్ల రాష్ట్ర ఖనిజ సంపదపై రాష్ట్రానికి ఉన్న ఆదాయ హక్కులు, గత బ బకాయిలను పొందే హక్కులు దెబ్బతింటాయని విమర్శించారు. ఖనిజ ప్రాంతాల్లో భూమి హక్కులకు సంబంధించిన అధికారాలు కూడా రాష్ట్రం నుంచి దూరమయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఖనిజ ప్రాంతాల్లో నివసించే ఆదివాసీలు, రైతుల జీవనోపాధి, భూమి హక్కులు దెబ్బతినే అవకాశం ఉందని అన్నారు. ఖనిజ తవ్వకాల వల్ల పర్యావరణ కాలుష్యాన్ని ప్రజలు ఎదుర్కొంటారని, పెద్ద పారిశ్రామిక సంస్థలకు ప్రయోజనం చేకూరుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు

ఏఐసీసీ సాధారణ కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి లాలాజీ దేశాయ్‌ మాట్లాడుతూ.. డబుల్‌ ఇంజన్‌ సర్కారుగా పిలుస్తున్న బీజేపీకి కాలం చెల్లిందని అన్నారు. అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ఎంఎండీఆర్‌ సవరణ చట్టం వల్ల రాష్ట్రానికి తీరని నష్టం వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దాన్ని సమర్థిస్తూ 20 మంది రాష్ట్రానికి చెందిన ఎంపీలు వత్తాసు పలకడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇదిలాఉండగా ఆదివాసీ వ్యక్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝి కేంద్ర ప్రభుత్వానికి కీలుబొమ్మగా మారారని ఎద్దేవా చేశారు.

ఎంఎండీఆర్‌ సవరణ బిల్లు రద్దు చేయాలనే డిమాండ్‌తో అసెంబ్లీ భవనం ఎదుట ఈ నెల 29 సంయుక్తంగా భారీ నిరసన చేపట్టనున్నట్లు కాంగ్రెస్‌ నాయకులు ప్రకటించారు. ప్రజలను మోసంగించే బీజేపీ ప్రభుత్వ విధానాలను ఎత్తి చూపడంతో పాటు ఆ పార్టీ రానున్న ఎన్నికల్లో కనుమరుగయ్యేంత వరకు తామంతా నిద్రపోమన్నారు. అంతకు ముందు కొరాపుట్‌ ఎంపీ సప్తగిరి శంకర్‌ ఉలక, పీసీసీ మాజీ అధ్యక్షులు శరత్‌ పట్నాయక్‌, నిరంజన్‌ పట్నాయక్‌, జయదేవ్‌ జెన్న, ఏఐసీసీ కార్యదర్శి కుసుం కుమార్‌ రెడ్డి, సీపీఐ నాయకుడు ఆలీ కిశోర్‌ పట్నాయక్‌, సీపీఐ(ఎం) నాయకుడు ప్రశాంత్‌ మిశ్రో, పీసీసీ సాధారణ కార్యదర్శి దుర్గా ప్రసాద్‌ పండా, కార్యదర్శి తుబాటి రాము, ఎమ్మెల్యేలు లక్ష్మణ్‌ ముండా, అప్పల స్వామి కడ్రక, జయపురం ఎంఎల్‌ఏ తారా ప్రసాద్‌ బాహిని పతి, గుణుపూర్‌ ఎంఎల్‌ఏ సత్యజీత్‌ గొమాంగొ, బిసంకటక్‌ ఎంఎల్‌ఏ నీలమాధవ హికక తదితర పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అంతకు ముందు స్థాఽనిక కొత్త బస్టాండు వద్ద గల బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసిన నాయకులు ఫ్‌లైఓవర్‌ బ్రిడ్జి, కాపిలాస్‌ కూడలి, సమితి కార్యాలయం మీదుగా సమావేశ వేదిక వద్దకు ర్యాలీగా చేరుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement