మల్కన్‌గిరి: మల్కన్‌గిరి సమితిలో కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ప్రధమేశ్ అర్వింద్ రాజాశిర్కే ఆధ్వర్యంలో సోమవారం గ్రీవెన్స్ సెల్ నిర్వహించారు. 42 వినతులు స్వీకరించారు. పలు సమస్యలను కలెక్టర్ వెంటనే పరిష్కరించారు. మారికొన్ని సమస్యల పరిష్కారానికి ఆయా శాఖల అధికారులకు ఆదేశించారు. జిల్లా ఎస్పీ వినోద్ పటేల్, పలువురు అధికారులు పాల్గొన్నారు. లబ్ధిదారులకు అంత్యోదయ గృహ యోజన నిధులను కలెక్టర్ అందజేశారు. పలు సంక్షేమ పథకాలను, దివ్యాంగ పింఛన్‌ను అందజేశారు.
చట్టాలపై అవగాహన అవసరం
పర్లాకిమిడి: గజపతి జిల్లా గుమ్మ బ్లాక్ మునిసింగి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం మధ్యాహ్నం జిల్లా న్యాయసేవా ప్రాధికరణ అధికారి, జిల్లా జడ్జి జగదీష్ ప్రసాద్ మహాంతి ఆదేశాల మేరకు విద్యార్థులకు న్యాయ సచేతన సదస్సును జిల్లా లీగల్ సర్వీసెస్ కార్యదర్శి బిమల్ రౌళో అధ్యక్షతన జరిగింది. ఆడపిల్లలు, విద్యార్థినులపై లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ (పోక్సో చట్టం), నల్సా పరిహార చట్టం–2016ను వివరించారు. బాధితులకు చట్టపరమైన హక్కులు, ఉచిత న్యాయసేవలు, పరిహారం, వారికి పునరావాస సౌకర్యాలను ప్రస్తావించారు. ఈ సదస్సులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేష్ కుమార్ మిశ్రా నల్సా చట్టం (యాసిడ్ దాడుల బాధితులకు న్యాయ సేవలు)పై విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మునిసింగి ఉన్నత పాఠశాల హెచ్‌ఎం మధుస్మితా సబర్, వన్ స్టాప్ సెంటర్ ప్రతినిధి శివాణీ సామంత్రాయ్, పరా లీగల్ వలంటీర్ (పి.ఎల్.వి.) శశిరేఖా బిశోయి, సిబ్బంది పాల్గొన్నారు.
అల్జీమెర్స్‌పై అవగాహన
పర్లాకిమిడి: గుసాని సమితి గురండి గ్రామంలో సెంచూరియన్ వర్సిటీ స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు ప్రపంచ అల్జిమెర్స్ దినం పురస్కరించుకుని ప్రజల్లో అవగాహన కల్పించారు. ప్రతి మనిషిలో రోగ నిరోధక శక్తి తగ్గినపుడు, మధ్య, వయోవృద్ధుల్లో అల్జీమెర్స్ వ్యాధి వల్ల బ్రెయిన్ పనిచేయదని నర్సింగ్ స్కూల్ అధ్యాపకురాలు శ్వేత అన్నారు. ఈ సందర్భంగా వయోవృద్ధులు, మధ్య వయస్కులకు సోకకుండా నివారణ చర్యలు చేపట్టాలన్నారు. మంచి పోషక ఆహారం, నిత్యం వ్యాయామం, యోగా, నడక ద్వారా కొంత వరకు వ్యాధిని నివారించవచ్చని అధ్యాపకురాలు మధురిమ అన్నారు. నర్సింగ్ విద్యార్థులు పోస్టర్ ప్రెజెంటేషన్, కరపత్రాలను గ్రామస్తులకు పంపిణీ చేశారు.
మత్స్యశాఖ మంత్రి సమీక్ష
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా బీజేపీ కార్యాలయంలో సోమవారం రాష్ట్ర మత్స్య, పశుసంపద శాఖ మంత్రి గోకలనంద మల్లిక్ ఆధ్వర్యంలో జిల్ల స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఆశోక్ కుమార్ పరిడా అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి గోకల్‌నంద మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17 నుంచి ఆక్టోబర్ 17వ తేదీ వరకు నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ కార్యక్రమం గురించి వివరించారు. లబ్ధిదారులను కలవడం, వివిధ ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహించడం వంటి అంశాలను ప్రస్తావించారు. ప్రధాననరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలో వ్యవసాయ, ఆరోగ్యం, రవాణా, ఆహార భద్రతకు ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి పేర్కొన్నారు. 2014 తర్వాత దేశంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. నక్సలిజం నిర్మూలన దిశగా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ధాన్యం కొనుగోలు ధర రూ. 800 పెంపు, పుప్పు ధాన్యాలకు సరైన ధర, పీఎం కిసాన్ పథకాల గురించి వివరించారు. ముందుగా బీజేపీ వ్యవస్థాపకులు శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీనదయాళ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సమావేశంలో మల్కన్‌గిరి ఎమ్మెల్యే నర్సింగ్ మాడ్కమి, చిత్రకొండ మాజీ ఎమ్మెల్యే డొంబురు సీసా, ప్రతేక అభివృద్ధి మండలి చైర్మన్ గంగా సోడీ, ఎంపీ ప్రతినిధి సంజాయ్ సర్క్‌ర్, ఎమ్మెల్యే ప్రతినిధి నిహల్ రౌయి పాల్గొన్నారు.


