● వార్డుల్లో బెడ్‌లు లేక వరండాలోనే చికిత్స
● అత్యవసర పరిస్థితిలో ఉన్న చిన్నారికి అక్కడే ఆక్సిజన్
రాయగడ: జిల్లా ప్రధాన ఆస్పత్రిలో శిశువుల వైద్యంలో దుస్థితి మరోసారి వెలుగులోకి వచ్చింది. శిశువుల వార్డుల్లో బెడ్లు సరిపోకపోవడంతో 40 మందికి పైగా చిన్నారులను వార్డు వెలుపల వరండాలో ఉంచి చికిత్స అందిస్తున్న దృశ్యాలు కనిపించాయి. అంతేకాకుండా తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఓ చిన్నారికి వరండాలోనే ఆక్సిజన్ అందిస్తున్న పరిస్థితి కనిపించడంతో ఆస్పత్రి నిర్వహణపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని 11 సమితులకు ప్రధాన ఆధారంగా ఉన్న ఈ ఆస్పత్రిలో పేషెంట్ల సంఖ్య పెరుగుతున్నా అందుకు అనుగుణంగా సదుపాయాలు పెంచడం లేదు. ముఖ్యంగా శిశువులను వార్డు వెలుపల ఉంచి చికిత్స చేయడం వల్ల ఇన్‌ఫెక్షన్‌ల ముప్పు భయం వెంటాడుతోంది.
శిశువార్డులో ప్రస్తుతం 35 పడకలు మాత్రమే ఉన్నాయి. సీజనల్ వ్యాధులు పెరిగే సమయంలో శిశు రోగుల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో పడకలు సరిపోవడం లేదని తెలుస్తోంది. ముందస్తుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆస్పత్రిలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెబుతున్న సమయంలో, చిన్నారులను వార్డు వెలుపల వరండాలో ఉంచి చికిత్స చేయడం ఎంతవరకు సమంజసమని సామాజిక కార్యకర్త బలరాం పండ ప్రశ్నించారు. శిశు విభాగంలోని ఈ పరిస్థితి అత్యంత సున్నితమైన అంశమని, చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని ఆయన అన్నారు.
గతంలో రాయగడ జిల్లా ఆస్పత్రి 2019 నుంచి 2023 వరకు కాయాకల్ప్ అవార్డులతో పాటు శిశు వైద్య సేవలకు సంబంఽధించి ముస్కాన్ ధ్రువీకరణ పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి పొందినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం పెరగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా వైద్య సదుపాయాలను విస్తరించడంలో అధికారులు తగినంత శ్రద్ధ చూపడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. అయితే శిశు వార్డులో రోగుల సంఖ్య పెరగడంతోనే పడకల కొరత ఏర్పడిందని హస్పటల్ మేనేజర్ లక్ష్మీప్రియ స్వయిన్ తెలిపారు. అయినప్పటికీ చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఆమె పేర్కొన్నారు.


