తుఫాన్‌ ముప్పు లేదు: ప్రధాన కార్యదర్శి | - | Sakshi
Sakshi News home page

తుఫాన్‌ ముప్పు లేదు: ప్రధాన కార్యదర్శి

Sep 22 2026 1:12 AM | Updated on Sep 22 2026 1:12 AM

భువనేశ్వర్‌: ప్రస్తుతం తుఫాన్‌ వచ్చే అవకాశం లేదని, బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడన వ్యవస్థ ప్రభావంతో దక్షిణ ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనూ గర్గ్‌ తెలిపారు. లోక్‌ సేవా భవన్‌లో సోమవారం జరిగిన విపత్తు నిర్వహణ ఉన్నత స్థాయి సన్నద్ధత సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ వాతావరణ పరిస్థితిని ఎదుర్కోవడానికి అన్ని సంబంధిత శాఖలు, జిల్లా యంత్రాంగాలు పూర్తి అప్రమత్తతతో ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డీ) సమాచారం ప్రకారం బంగాళా ఖాతంలో ఏర్పడిన స్పష్టమైన అల్పపీడనం రాబోయే 24 గంటల్లో వాయు గుండంగా, ఆ తర్వాతి 24 గంటల్లో తీవ్ర వాయు గుండంగా బలపడే అవకాశం ఉంది. ఇది పశ్చిమ, వాయువ్య దిశగా కదులుతూ ఈ నెల 23 ఉదయానికి ఉత్తర ఆంధ్రప్రదేశ్‌, దక్షిణ ఒడిశా తీరం సమీపానికి చేరుకుంటుందని అంచనా. ఈ నెల 22 మంగళ వారం నుండి దక్షిణ ఒడిశాలోని సుమారు 11 జిల్లాల్లో వర్షాలు ప్రారంభమై 24 గురువారం వరకు కొనసాగే అవకాశం ఉంది. ఈ వ్యవధిలో తీర ప్రాంతంలో గంటకు 45 నుంచి 55 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. మధ్య బంగాళాఖాతంలో గాలి వేగం గంటకు సుమారు 70 కిలో మీటర్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు.

గంజాం, గజపతి, మల్కన్‌గిరి, ఇతర ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో అనూ గర్గ్‌ సన్నద్ధతను సమీక్షించారు. లోతట్టు ప్రాంతాలు, మురుగునీటి వ్యవస్థలు, నదీ పరివాహక ప్రాంతాలపై నిశితంగా నిఘా ఉంచాలని ఆమె వారిని ఆదేశించారు. ప్రభావితం అయ్యే అవకాశం ఉన్న జిల్లాల్లోని అధికారుల సెలవులను రద్దు చేయాలని ఆదేశించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గర్భిణులను ఆస్పత్రులకు తరలించాలని సూచించారు. జల వనరుల శాఖ జలాశయాల మట్టాలను, నీటి నిర్వహణను సమీక్షించింది. బలిమెల, కోలబ్‌ జలాశయాల్లో వర్షపు నీటిని నిల్వ చేయడానికి అనుకూలంగా ఉంది. ఇంద్రావతి జలాశయం సుమారు 84 శాతం నీటితో నిండి ఉంది. అవసరమైన మేరకు నీటి మట్టాన్ని తగ్గించాలని, ఆనకట్టలు, నదుల గట్లు, ఇతర ప్రమాదకర ప్రదేశాలను నిశితంగా పర్యవేక్షించాలని ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు.

వరద, తుఫాన్‌ ఆశ్రయ కేంద్రాల వద్ద ఏర్పాట్లను కట్టుదిట్టంగా తనిఖీ చేస్తున్నారు. అదే సమయంలో ఒడిశా విపత్తు సహాయ స్పందన దళం (ఒడ్రాఫ్‌) మరియు జాతీయ విపత్తు సహాయ స్పందన దళం (ఎన్‌ డీఆర్‌ఎఫ్‌) బృందాలను మోహరిస్తున్నారని ప్రత్యేక సహాయ కమిషనర్‌ (ఎస్‌ఆర్‌సీ) కార్యాలయం తెలిపింది. ఈ కార్యాలయంలో రాత్రింబవళ్ళు పని చేసే కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. ఈ నెల 24 వరకు సముద్రంలోకి వెళ్లవద్దని మత్స్యకారులకు సూచించారు. ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు తక్షణమే తిరిగి రావాలని కోరారు. మారుతున్న వాతావరణ పరిస్థితి దృష్ట్యా అన్ని శాఖలు, జిల్లా యంత్రాంగాలు సన్నిహిత సమన్వయం పాటించాలని ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. సమావేశానికి అగ్ని మాపక సేవల డైరెక్టర్‌ సుధాంశు షడంగి, ప్రత్యేక సహాయ కమిషనర్‌ రాజేష్‌ ప్రభాకర్‌ పాటిల్‌, వివిధ సంబంధిత శాఖల కార్యదర్శులు, సీనియర్‌ అధికారులు జలవనరుల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌, హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement