రాయగడ: డిజిటల్ వ్యవస్థలపై సైబర్ దాడుల ముప్పు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత సైబర్ భద్రతా వ్యవస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొన్నారు. జిల్లాలోని గుణుపూర్‌లో ఉన్న గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (జీఐఈటీ) విశ్వవిద్యాలయంలో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఆధ్వర్యంలో అటల్ వాణి కార్యక్రమంలో భాగంగా కృత్రిమ మేధస్సు ఆధారిత సైబర్ బలమైన వ్యవస్థలు అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ పరిధిలోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం ఈ సదస్సును నిర్వహిస్తుంది. ప్రారంభ కార్యక్రమానికి భువనేశ్వర్‌లోని ఒడియా అధ్యయన, పరిశోధన సంస్థ సభ్య కార్యదర్శి డాక్టర్ సుభ్రత్ కుమార్ పృష్టి ముఖ్య అతిథిగా హాజరై ప్రస్తుత సైబర్ భద్రత పరిస్థితులు, కృత్రిమ మేధస్సు విస్తరిస్తున్న ప్రభావంపై మాట్లాడారు. భువనేశ్వర్‌కు చెందిన తానుమనాస రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన అవినాష్ దాస్, రాయగడకు చెందిన ధీవ్రితి తెక్ సీఈవో రామా ఆర్.నాయుడు నిపుణులుగా పాల్గొని సైబర్ భద్రత, ఏఐ సాంకేతికతలోని వివిధ అంశాలను వివరించారు. జీఐఈటీ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ గౌతమ్ ఘోష్, స్కూల్ ఆఫ్ ఇంజినిరింగ్ అండ్ టెక్నాలజీ డీన్ డాక్టర్ కె.మురళి గోపాల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగాధిపతి డాక్టర్ శివకృష్ణ తదితరులు వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ యుగంలో సైబర్ దాడులను ఎదుర్కొవడంలో ఏఐ ఆధారిత భద్రతా వ్యవస్థల ప్రాధాన్యతను వివరించారు. ఏఐ, మెషిన్ లెర్నింగ్ సాంకేతికతలను ఉపయోగించి సైబర్ దాడులను ముందుగానే గుర్తించడం, వాటిని నిరోధించడం, దాడులు జరిగినప్పుడు తక్షణ చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై సదస్సులో విస్తృతంగా చర్చించారు. కార్యక్రమంలో డాక్టర్ సత్యనారాయణ దాస్ స్వాగతోపన్యాసం చేయగా.. డాక్టర్ రాఘవేంద్ర కుమార్ ధన్యవాదాలతొ ముగిసింది.


