భువనేశ్వర్: ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ కొలువులో 2 మంది సభ్యులు ఉప ముఖ్యమంత్రులుగా కొనసాగుతున్నారు. ఈ నియామకం హోదా, అధికార విస్తరణకు సంబంధించి రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ విషయం విచారించిన రాష్ట్ర హై కోర్టు ఉప ముఖ్యమంత్రి పదవి కేవలం అలంకార ప్రాయం. ప్రత్యేకంగా రాజ్యాంగపరమైన హోదా వగైరా అదనపు అధికారాలు, సౌలభ్యాలు కలిగి ఉందని ఉన్నత న్యాయ స్థానం వివరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 2 ఉప ముఖ్యమంత్రుల పదవులను సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పీఐఎల్)ను ఒడిశా హై కోర్టు కొట్టి వేసింది. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి అనేది కేవలం ఒక హోదా లేదా బిరుదు మాత్రమేనని పేర్కొంది. ఇది ముఖ్యమంత్రికి ఉన్నటువంటి అదనపు రాజ్యాంగ అధికారాలను ఉప ముఖ్యమంత్రికి కల్పించదు. రాజ్యాంగపరంగా ఉప ముఖ్యమంత్రి కూడా రాష్ట్ర మంత్రి మండలిలో కేవలం ఒక సభ్యుడేనని రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం స్పష్టంగా పేర్కొంది. రాష్ట్ర హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి హరీష్ టండన్, జస్టిస్ చిత్తరంజన్ దాస్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ విషయాన్ని విచారించి ఉప ముఖ్యమంత్రి పదవి కేవలం ఒక వర్ణనాత్మక బిరుదు మాత్రమేనని స్పష్టం చేసింది. మంత్రి మండలిలోని ఇతర సభ్యులతో పోలిస్తే ఇది ఎలాంటి అదనపు రాజ్యాంగ అధికారాన్ని గానీ, ప్రాధాన్యతను గానీ కల్పించదు. న్యాయ స్థానం తీర్పు ప్రకారం ఒకరిని ఉప ముఖ్యమంత్రి అని పిలవడం వల్ల వారికి ముఖ్యమంత్రి అధికారాలు లభించవు, వారు మంత్రి మండలిలో మంత్రిగా మాత్రమే వ్యవహరిస్తారు. ఉప ముఖ్యమంత్రికి కల్పించే ప్రాధాన్యత లేదా స్థానం కేవలం లాంచనప్రాయం, అధికారిక కార్యక్రమాల కోసమేనని హై కోర్టు స్పష్టం చేసింది. ప్రోటోకాల్‌లో ఉన్నత స్థానం అంటే పరిపాలనా వ్యవస్థలో అధిక రాజ్యాంగ అధికారాలు లభించినట్లు కాదు అని సవివరంగా తెలియజేసింది. కేఎం శర్మ వర్సెస్ దేవీ లాల్ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర హై కోర్టు ఇక్కడ ప్రస్తావించింది. ఆ తీర్పులో ఉప ముఖ్యమంత్రి పదవి ఒక మంత్రికి ముఖ్యమంత్రి అధికారాలను కల్పించదని కూడా స్పష్టం చేసినట్లు ఉదహరించింది. ఒడిశాలోని ఇద్దరు ఉప ముఖ్యమంత్రుల పదవులను సవాలు చేస్తూ ఎలీనా దాస్ అనే ఆమె ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పీఐఎల్) దాఖలు చేశారు. ఇతర మంత్రుల కంటే వారికి ఉన్నత పదవి, ప్రత్యేక ప్రోటోకాల్, అధిక అధికారాలు కల్పిస్తున్నారని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 163, 164లను ఉల్లంఘిస్తోందని ఆమె ఆరోపించారు.


