రైలు ఇంజిన్‌ ఢీకొని ఏనుగు మృతి | - | Sakshi
Sakshi News home page

రైలు ఇంజిన్‌ ఢీకొని ఏనుగు మృతి

Sep 11 2026 8:10 AM | Updated on Sep 11 2026 8:10 AM

రాయగడ: రైలు ఇంజన్‌ ఢీకొనడంతో ఒక దంతాల ఏనుగు మృతి చెందిన ఘటన జిల్లాలోని బిసంకటక్‌ సమీపంలో చోటు చేసుకుంది. బిసంకటక్‌ సమితిలో బురుందాబడి సమీపంలోని బిసంకటక్‌–తెరువలి రైల్వేమార్గంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి సమయంలో జరిగినట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది, అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భారీ వర్షం కురుస్తుండడంతో ఏనుగు మృతదేహాన్ని తరలించే ప్రక్రియ ఆలస్యమవుతోంది. కాగా గత కొన్ని నెలలుగా కలహండి జిల్లా నుంచి వచ్చిన నాలుగు ఏనుగుల గుంపు బిసంకటక్‌ సమితిలోని బాత్‌పూర్‌, బురుందాబడి ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు భావిస్తున్నారు.

కొరాపుట్‌ ఎంపీ సప్తగిరి ఉల్కకి సంసద్‌ రత్న–2026 అవార్డు

కొరాపుట్‌: కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కొరాపుట్‌ పార్లమెంట్‌ సభ్యుడు సప్తగిరి ఉల్కకి 16వ సంసద్‌ రత్న–2026 అవార్డు లభించింది. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఈ అవార్డు ప్రధానం చేశారు. ఈ ఏడాది ఉత్తమ పార్లమెంటేరియన్‌గా స్టాండింగ్‌ కమిటీలలో పని చేసినందుకు ఈ అవార్డు లభించింది. సప్తగిరి ఉల్క నేతృత్వంలో పంచాయతీ రాజ్‌ స్టాండింగ్‌ కమిటీ దేశ వ్యాప్తంగా విస్తృత పర్యటనలు చేసి తన పనితీరు చూపింది. 18 లోక్‌ సభలో 41 నివేదికలు సమర్పించింది. నాటి భారత రాష్ట్ర పతి అబ్దుల్‌ కలాం సూచనలు మేరకు 2010 లో ఈ సంసద్‌ రత్న అవార్డుల కమిటీ ఏర్పడింది. ఈ అవార్డు తనకు లభించడంలో కమిటీ లో ఉన్న మీగతా ఎంపీల కృషి ఉందని ఉల్క ప్రకటించారు.

ఫుడ్‌కోర్టు ప్రారంభం

రాయగడ: పట్టణ ప్రజలకు మెరుగైన పౌర సౌకర్యాలు కల్పించే దిశగా మరో ముందడుగు పడింది. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్థానిక ఒంటరీగుడలో నిర్మించిన నూతన ఫుడ్‌కోర్టును రాష్ట్ర వాణిజ్య, ఉక్కు, గనుల శాఖ మంత్రి బిభూతి భూషన్‌ జెన్న గురువారం ప్రారంభించారు. దీంతో పట్టణ వాసులకు పరిశుభ్రమైన, సౌకర్యమైన వాతావరణంలో ఆహారం ఆస్వాదించే అవకాశం అందుబాటులోకి వచ్చిందని మంత్రి జెన్న అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ అశుతోష్‌ కులకర్ణి, డుడా ప్రాజెక్టు డైరక్టర్‌ అక్షయ కుమార్‌ ఖెముండొ, మున్సిపాలిటీ కార్యనిర్వాహక అధికారి కలదీప్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ఒంటరీగుడ ఫుడ్‌కోర్టు ఏర్పాటుతో స్థానిక ఆహార వ్యాపారులు, చిన్నతరహా వ్యాపారులు, యువతకు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాల పెరగనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా ప్రజలకు పరిశుభ్రమైన, సక్రమంగా నిర్వహించే ఆకర్షణీయమైన ప్రదేశంలో వివిధ రకాల ఆహారాన్ని పొందే అవకాశఽం కలుగుతుందన్నారు

అక్టోబర్‌ 2 నుంచి భువనేశ్వర్‌,

బ్యాంకాక్‌ విమాన సేవల పునరుద్ధరణ

భువనేశ్వర్‌: ఈ ఏడాది అక్టోబర్‌ 2 నుంచి భువనేశ్వర్‌ నుంచి బ్యాంకాక్‌కు ప్రత్యక్ష విమాన సేవలు పునరుద్ధరిస్తున్నారు. స్థానిక బిజూ పట్నాయక్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బ్యాంకాక్‌కు వారానికి 2 రోజులు ఈ విమాన సేవలు లభిస్తాయి. తాత్కాలికంగా నిలిపి వేసిన ఈ సౌకర్యం ఒడిశా రాజధాని మరియు థాయ్‌ రాజధాని మధ్య ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రత్యక్ష విమాన యానం అందిస్తుంది. ఆశించిన మేరకు ప్రయాణికుల స్పందన కొరవడడంతో విమానయాన సంస్థ ఇంతకు ముందు ఈ సేవలను నిలిపి వేసింది. అక్టోబర్‌ నుంచి పర్యాటక సీజన్‌ ప్రారంభం కానుండటంతో భువనేశ్వర్‌, బ్యాంకాక్‌ మధ్య ప్రత్యక్ష విమానయాన సేవలు తిరిగి ప్రారంభిస్తున్నారని స్థానిక విమానాశ్రయ డైరెక్టర్‌ ప్రసన్న ప్రధాన్‌ తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement