రాయగడ: పట్టణంలోని ఇందిరానగర్ ఆరో లైన్ సమీపంలోని నాగావళి నదితీరంలో నివసిస్తున్న మురికివాడ ప్రజలకు జిల్లా యంత్రాంగం తొలగింపు నోటీసులు జారీ కావడంతో వారు ఆందోళనకు గురయ్యారు. ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులయ్యే పరిస్థితి ఏర్పడుతుందనే భయంతో 27 కుటుంబాలు కలెక్టర్ అశుతోస్ కులకర్ణిని ఆశ్రయించి తమకు పునరావాసం కల్పించిన అనంతరం ఇళ్లను తొలగించాలని కోరారు. సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి జారీ చేసిన నోటీసుల్లో ఈ నెల 25 వ తేదీలోగా ప్రాంతాన్ని ఖాళీ చేయాలని సూచించినట్లు బాధితులు తెలిపారు. తాము చాలా కాలంగా అక్కడే నివసిస్తున్నామని అంతా కూలి పనులు, ఇతర ఇళ్లలో పనులు చేస్తూ జీవనోపాధి కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ఇళ్లు ఖాళీ చేయించే ముందు ప్రత్యామ్నాయంగా స్థలం, పునరావాసం కల్పించాలని కోరారు.


