రాయగడ: జిల్లాలోని మునిగుడ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా దొంగిలించిన రాగి తీగలు పట్టుబడ్డాయి. మొత్తం 300 కిలోల రాగి తీగలు, ఇతర రాగి సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకుని, దీనికి సంబంధించి ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న సామగ్రి విలువ సుమారు రూ.3 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 9వ తేదీ సాయంత్రం మునిగుడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఏఎస్‌ఐ జె.సాహు నేతృత్వంలో సిబ్బందితో కలిసి వాహన తనిఖీలను నిర్వహిస్తుండగా.. అంబొదల వైపు నుంచి మునిగుడకు వస్తున్న ఒక కారును ఆపి తనిఖీ చేశారు. కారులో ఏడు ప్లాస్టిక్ గోనె సంచుల్లో రాగి తీగలు, ఇతర రాగి సామగ్రి ఉన్నట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో మునిగుడకు చెందిన కన్హు చరణ్ సుబుద్ధి అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతని నుంచి రాగి సామగ్రితో పాటు డిజిటల్ వెయింగ్ మెషిన్, కారు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకొని నిందితుడిని కోర్టుకు తరలించారు.
పాముకాటుతో వృద్ధురాలు మృతి
జయపురం: పాముకాటుతో ఒక వృద్ధురాలు మృతి చెందింది. ఈ సంఘటన జయపురం సబ్ డివిజన్ బొయిపరిగుడ పంచాయతీ సమితి చిపాకూర్ గ్రామ పంచాయతీ చిపాకూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సపాయి పంగి(80) బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో వంట ఇంటిని తుడుస్తోంది. పొయ్యి సమీపంలో తుడుస్తున్న సమయంలో హటాత్తుగా ఒక నాగుపాము ఆమె కాలుపై కాటువేసింది. స పాయి పంగి ఆక్రందనకు కుటుంబ సభ్యులు వచ్చారు. ఆమె తనకు పాము కరిచిందని చెప్పడంతో తక్షణమే బొయిపరిగుడ కమ్యూనిటీ హాస్పిటల్‌కు తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆమెను హాస్పిటల్‌కు తీసుకెళ్లకముందే ప్రాణాలు విడిచింది. విషయం తెలిసిన రామగిరి పోలీసు పంటి ఏఎస్‌ఐ విష్ణు మడకామి చిపాకూర్ గ్రామం చేరుకొని సంఘటనపై దర్యాప్తు జరిపారు. కేసు నమోదు చేసి, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు బొయిపరిగుడ పోలీసులు వెల్లడించారు.


