దంపతులపై దారి దోపిడీ | - | Sakshi
Sakshi News home page

దంపతులపై దారి దోపిడీ

Sep 10 2026 2:33 AM | Updated on Sep 10 2026 2:33 AM

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా మాత్తిలి సమితి దుమాలిగూడ గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి ముసుగులు ధరించి పలువురు దుండగులు గ్రామానికి చెందిన రఘుగౌడ్‌, చంపా గౌడ్‌ దంపతుల ఇంట్లోకి చొరబడి బీభత్సం సృష్టించారు. మారణాయుధాలతో బెదిరించి బీరువా తెరిచి రూ.3లక్షలు నగదు, బంగారు ఆభరణాలతో పరారయ్యారు. ఈ మేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రఘు ఇటీవలే తన స్వగ్రామం గౌడిగూడలో భూమిను అమ్మి డబ్బులు తెచ్చి ఇంట్లో భద్రపరిచాడు. ఈ విషయం తెలుసుకున్న దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పడవ బోల్తాపడి ఒకరి మృతి

నందివాడ: చేపల మేత కట్టేందుకు చెరువులోకి వెళ్లిన ఒడిశా రాష్ట్రానికి చెందిన వ్యక్తి ప్రమాదవశాత్తు పడవ బోల్తాపడి నీట మునిగి మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లా నందివాడ మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. నందివాడ మండలం తుమ్మలపల్లి గ్రామంలో భాస్కర్‌ ప్రదీప్‌కు చెందిన చెరువుల్లో చేపల మేతకట్టే పనుల కోసం ఒడిశా రాష్ట్రానికి చెందిన బాలసింగ్‌ మాజీ (36), అతని బంధువులు బుగన మాజీ, సునదర్‌ మాజీ తదితరులు వచ్చారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో బాలసింగ్‌ మాజీ, బుగున మాజీ పడవలో చేపల మేత కట్టలు తీసుకుని చెరువులో మేత కడుతుండగా ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చి ఈదురుగాలులు వీచాయి. దీంతో పడవ అదుపుతప్పి బోల్తా పడింది. ఇద్దరూ చెరువులో పడిపోయారు. ఇద్దరూ ఈదుకుంటూ ఒడ్డుకు వస్తుండగా బాలసింగ్‌ మాజీ ఒక్కసారిగా చెరువులో మునిగిపోయాడు. చెరువుపై పనిచేస్తున్న వారు గమనించి కేకలు వేయడంతో అక్కడున్నవారు అతని కోసం గాలించారు. అయితే బాలసింగ్‌ మాజీ నీటిలో మునిగి ఊపిరాడక మృతి చెందాడు. ప్రదీప్‌ చెరువులపై గుమస్తాగా పనిచేస్తున్న మాతంగి రాజేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందివాడ ఎస్‌ఐ సుబ్రహ్మణ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

విద్యుత్‌ టవర్‌పై

యువకుడి ఆత్మహత్య

తెలియరాని మృతుని వివరాలు

రాయగడ: జిల్లాలోని బిసంకటక్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గొయిలొకొన గ్రామ సమీపంలో ఉన్న విద్యుత్‌ టవర్‌పై యువకుని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడు విద్యుత్‌ టవర్‌కు తాడు కట్టి దాని సహాయంతొ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. మంగళవారం కొంతమంది ఆ మార్గం వైపు వెళ్లే సమయంలో విద్యుత్‌ టవర్‌పై మృతదేహం కనిపించడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యుత్‌ సరఫరాను నిలిపివేసి మృతదేహాన్ని కిందకుదించారు. అయితే ఈ ఘటన అయిదు రోజుల క్రితం జరిగి ఉంటుందని మృతదేహాన్ని బట్టి పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.

ఆహార భద్రత అధికారుల తనిఖీలు

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి కేంద్రంలో బుధవారం ఆహార నాణ్యత, పరిశుభ్రతను నిర్ధారించేందుకు ఆహార భద్రత శాఖ, మున్సిపాలిటీ సంయుక్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వసించారు. ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, స్వీట్‌ షాప్‌లు, టిఫిన్‌ సెంటర్లలో ఆహార ఉత్పత్తులను పరిశీలించారు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. తనిఖీల్లో జిల్లా ఆహార భద్రతా అధికారి ప్రభాష్‌ సేఠీ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement