భువనేశ్వర్: ఉత్తర బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ప్రాంతాలపై తుఫాను వలయం చురుకుగా బలపడుతోంది. దాని ప్రభావం కారణంగా గురువారం ఉత్తర బంగాళా ఖాతం, దానిని ఆనుకుని ఉన్న ప్రాంతాలపై అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. వాయవ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న ప్రాంతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడనుంది. ఈ నెల 11 నాటికి క్రమంగా బలపడుతుంది. దీనివల్ల రాష్ట్రంలో మరో విడత వర్షాలు కురిసే అవకాశం ఉందని స్థానిక ప్రాంతీయ వాతావరణ కేంద్రం (ఆర్‌ఎంసీ) సమాచారం. గురువారం చాలా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కార్యాలయం హెచ్చరిక జారీ చేసింది. రెండు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక, 23 జిల్లాలకు పసుపు హెచ్చరిక జారీ చేశారు. ఆయా ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ఆర్‌ఎంసీ సూచించింది. ఒడిశా తీరప్రాంతంలోని మత్స్యకారులకు భువనేశ్వర్ వాతావరణ కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. ఈ నెల 9 నుంచి 11 వరకు ఒడిశా తీర ప్రాంతంలో గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో గరిష్టంగా 60 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, తీరం వెంబడి సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉందని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణ కేంద్రం సూచించింది.
సముద్రంలోకి వెళ్లవద్దని
మత్స్యకారులకు సూచన
పలు జిల్లాలకు భారీ వర్ష హెచ్చరిక


