పర్లాకిమిడి: న్యూఢిల్లీలో జాతీయ విద్యావిధానం, పరిపాలనా సంస్థ (నైపా) ఆధ్వర్యంలో ఈ నెల రెండో తేదీన జరిగిన కార్యక్రమంలో గజపతి జిల్లా ముఖ్య విద్యాధికారి డాక్టర్ మయాధర్ సాహును ఉత్తమ అవార్డుతో సత్కరించారు. ఈ నేపథ్యంలో స్థానిక మహేంద్రగిరి పురపాలక ఉన్నత పాఠశాలలో మంగళవారం రాత్రి డీఈవో మయాధర్‌సాహును జిల్లాలోని ఉపాధ్యాయులంతా ఘనంగా సత్కరించారు. ఉపాధ్యాయురాలు సులతా శుభదర్శినీ అతిఽథి పరిచయం చేయగా, వేదికపై ఆదనపు ఈవో ఎస్.గిరిధర్, గుసాని, రాయగడ బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి టి.కిశోర్, జిల్లా సైన్సు కోఆర్డినేటరు వై.క్రిష్ణారావు, జీబ ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం మీనాక్షి పాడి, బాపూజీపెంట ఉన్నత పాఠశాల హెచ్‌ఎం సుజాతా నంద, నమ్మనగుడ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం హరిహార దాస్, పురపాలక సంఘం ఈవో లక్ష్మణ ముర్ము, భాగవత్ పాఢి హాజరై గజమాల, దుశ్శాలువతో సన్మానించారు. ఒడిశా రాష్ట్రంలో హయ్యర్ సెకండరీ బోర్డు పరీక్షల్లో వరుసగా 2024–25, 2025–26 విద్యా సంవత్సరాలలో గజపతి జిల్లా 99.35, 99 శాతం పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినందుకు మయాధర్ సాహుకు జాతీయ స్థాయి ఆవార్డును నైపా అందజేసింది.


