భువనేశ్వర్: వంట గ్యాస్ సిలిండర్లు, ఇతర నిత్యావసర వస్తువుల ధరల పెంపుపై ప్రతిపక్ష బిజూ జనతా దళ్ (బీజేడీ) మండిపడింది. ఈ పరిస్థితి తక్షణమే సవరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం స్థానిక మాస్టర్ క్యాంటీన్ స్క్వేర్ వద్ద బిజూ మహిళా జనతా దళ్, బిజూ యువ జనతాదళ్, బిజూ ఛాత్ర (విద్యార్థి) జనతా దళ్ విభాగాల సభ్యులు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. వంట గ్యాసు, ఇతర వినియోగ సామగ్రి ధరలు పెరుగుతున్నందున సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. ఈ క్రమంలో రోడ్డుపైనే కట్టెల పొయ్యిపై టీ తయారు చేశారు. ఎల్‌పీజీ సిలిండర్ ధరల పెరుగుదల, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై బీజేడీ సీనియర్ నాయకురాలు లేఖ శ్రీ సామంత సింగార్ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రతి ఇంటా నిత్య అవసర ఎల్‌పీజీ సిలిండర్ల ధర రూ. 60, వాణిజ్య సిలిండర్లు రూ. 119 పెరిగాయన్నారు. వంట నూనె ధరలు లీటరు దాదాపు రూ. 170కి పెరిగిందన్నారు. దేశంలో బలమైన ఆర్థిక, ఇంధన భద్రతా విధానం లేకపోవడం ధరల పెరుగుదల నియంత్రణ కోల్పోతుందన్నారు. అంతర్జాతీయ పరిణామాల వల్ల దేశీయ ధరలు ఎక్కువగా ప్రభావితమైతే ప్రభుత్వం అవసరమైన సామగ్రికి తగిన రక్షణ కల్పించడంలో విఫలమైందన్నారు. గతంలో ప్రపంచ చమురు ధరలు తగ్గినప్పుడు భారత ప్రభుత్వం ఎల్‌పీజీ, ఇతర వస్తువుల ధరలను గణనీయంగా తగ్గించలేదని ఆమె గుర్తు చేశారు. అయితే, అంతర్జాతీయ ధరలు పెరిగిన ప్రతి సందర్భంలో ఆ భారం వెంటనే ప్రజలపైకి బదిలీ అవుతుందన్నారు. ఎన్నికై న ప్రభుత్వానికి ప్రజలకు ఆహార భద్రత, ధరల స్థిరత్వం, ఆర్థిక రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఇంధన ధరలు పెరగడం వల్ల సాధారణ కుటుంబాలపై పడే ప్రభావంపై దృష్టిని ఆకర్షించడానికే మాస్టర్ క్యాంటీన్ ప్రాంతంలో నిరసనలు నిర్వహించామని బీజేడీ రాజ్య సభ సభ్యుడు డాక్టరు సస్మిత్ పాత్రొ అన్నారు. రాష్ట్రం డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో భాగమని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ధరల పెరుగుదల నుంచి పౌరులను రక్షించడానికి ఏ చర్యలు తీసుకుంటున్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.


