రాయగడ : రాయగడ మున్సిపాలిటీ వైస్ చైర్‌పర్సన్ శుభ్రపండ అవిశ్వాస తీర్మానంలో ఓటమి చవిచూశారు. బుధవారం ఉదయం 11 గంటలకు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. వైస్ ఛైర్మన్ శుభ్రపండకు వ్యతిరేకంగా 19 ఓట్లు పోలవ్వడంతో ఆమె ఓటమి చెందినట్లు ప్రకటనలో ఎన్నికల అధికారి పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 24 వార్డులకు గాను 19 మంది కౌన్సిలర్లు వైస్ చైర్మన్ శుభ్రపండ కార్యకలాపాలకు అసంతృప్తి వ్యక్తం చేస్తూ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. గత ఏడాది నవంబరు 24న అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఎన్నికల ప్రక్రియ పూర్తయినప్పటికీ ఫలితాలను ప్రకటించలేదు. తనపై వచ్చిన ఆరోపణల్లో ఎటువంటి నిజం లేదని పండ హైకోర్టును ఆశ్రయించడంతో ఫలితాలను ప్రకటించకుండా బ్యాలెట్ బాక్స్‌ను స్థానిక ట్రెజరీలో నిక్షిప్తం చేశారు. ఇదిలాఉండగా గత ఫిబ్రవరి 23న అవిశ్వాస తీర్మాణానికి సంబంధించిన ఫలితాలను వెల్లడించాలని హైకోర్టు ఉత్తర్యులు జారీ చేయడంతో బుధవారం ఫలితాలను వెల్లడించారు. ఫలితాలు వెల్లడించిన అనంతరం 19 మంది కౌన్సిలర్లు, వారి మద్దతుదారులు మున్సిపాలిటీ కార్యాలయం బాణసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం బిజు స్వాభిమాన్ మంచ్ వ్యవస్థాపకులు, రాజ్యసభ మాజీ ఎంపీ నెక్కంటి స్వగృహంలో వేడుకలు జరుపుకున్నారు.


