జయపురం: జయపురం సబ్‌డివిజన్ కొట్‌పాడ్ సమితి గులిమి పర్యాటక కేంద్రంలో జరిగిన యువకుడి హత్యకేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ నెల ఐదో తేదీన జరిగిన ఈ దారుణానికి కారణాలను పోలీసులు బుధవారం వెల్లడించారు. హత్య కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు బొరిగుమ్మ సబ్‌డివిజన్ పోలీసు అధికారి సత్యబ్రత లెంక తెలిపారు. కొట్‌పాడ్ పోలీసు స్టేషన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో హత్య కేసు వివరాలను వివరించారు. దొంగతనాల సొమ్ము పంచుకోవడంలో తలెత్తిన విభేదాలు, భూమి పంపకమే హత్యకు ప్రధాన కారణమన్నారు. గులిమి పర్యాటక ప్రాంతంలో ఒక రాయి కింద పడి ఉన్న భగడీరథ్ హరిజన్ మృతదేహాన్ని చూసిన వెంటనే హత్యగా అనుమానించి అదే రోజున ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించడంతో మిస్టరీ వీడిందన్నారు. ఆధారాలతో కొట్‌పాడ్ పోలీసు అధికారి ఫకీర్ మోహణ్ ఖొర సమర్థవంతంగా కేసును దర్యాప్తు
భగీరఽథ్ హరిజన్ (ఫైల్)
చేసి నిందితలను పట్టుకున్నారన్నారు. హతుడు భగీరథ్ హరిజన్ హత్య కేసులో అరెస్టయిన వారిలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం జగదల్‌పూర్ ప్రాంతానికి చెందిన వికాశ నాగ్, కొట్‌పాడ్ సమితి మొకాగాం జీసుధాన్ హరిజన్, టును హరిజన్, ఉదర హరిజన్, సొరిసిపొదర్ గ్రామానికి చెందిన మును గోండ్ ఉన్నారన్నారు. నిందితులు పలు ప్రాంతాలలో దొంగతనాలు చేసిన డబ్బులను పంచుకునేవారన్నారు. ఈ క్రమంలో ఓ దొంగతంలో వచ్చిన డబ్బు పంపకంలో విభేదాలు తలెత్తడంతో భగీరథ్ హరిజన్‌పై బండరాయి పడేసి హత్య చేశారని వివరించారు. హత్య కేసులో మరికొంతమంది నిందితులు ఉన్నారని వారిని త్వరలోనే పట్టుకుంటామన్నారు.


