కొరాపుట్: కరడు గట్టిన దొంగల ముఠాని నబరంగ్‌పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళ వారం నబరంగ్‌పూర్ జిల్లా ఉమ్మర్‌కోట్ పట్టణం లో ఎస్‌డీపీఓ సుభేంద్ సబర్ తన కార్యాలయంలో మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలు ప్రకటించారు. గత నెల 22వ తేదీన ఉమ్మర్‌కోట్ పట్టణానికి సమీపంలో కోచ్ని అంబ గ్రామంలో అమూల్య జెన్న ఇంటిలో భారీ దొంగతనం జరిగింది. ఆ రోజు ఆ కుటుంబం ఆస్తి అమ్మిన నగదు ఇంట్లో ఉందని తెలిసి దొంగల ముఠా దాడి చేసింది. వారింట్లో ఉన్న వారి పై దాడి చేసి రు.70 లక్షలు నగదు, పెద్ద మెత్తం లో బంగారు ఆభరణాలు దోచుకుపోయారు. ఈ కేసుని చాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు 3 బృందాలుగా ఏర్పడి ఏడుగురు దొంగలను అరెస్ట్ చేశారు. వీరి నుంచి రు.21 లక్షలు నగదు, బంగారు ఆభరణాలు, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో నబరంగ్‌పూర్‌కి చెందిన బబులా, మజ్జి గూడ గ్రామానికి చెందిన రొణ, గణేష్ రానా, దీరజ్ లైచన్, ధర్నాబెడ గ్రామానికి చెందిన చిత్రసేన్ గొండో, జయపూర్ కి చెందిన సిసిఎల్ కునాల్, కొట్‌పాడ్‌కి చెందిన సుఖదేవ్ ముదలి తదితరులు ఉన్నారు. వీరిని కోర్టులో హాజరు పరుస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు.


