రాయగడ: సదరు సమితి గజ్జిగాం పంచాయతీ పరిధిలో గల డెక్కాగుడలో మౌలిక సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్‌ను గ్రామస్తులు కోరారు. గ్రామంలో గల సమస్యలకు సంబంధించి సోమవారం వినతుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ అశుతోష్ కులకర్ణిని కలిసి వినతిపత్రం అందించారు. గ్రామంలో సమారు 50 కుటుంబాలు నివసిస్తున్నాయని, అంతా ఆదివాసీలేనని వినతిపత్రంలో పేర్కొన్నారు. గ్రామంలో తాగునీటి సమస్య గత కొన్నాళ్లుగా ఉందన్నారు. ఉన్న ఒక్క గొట్టపు బావి సరిపోవడం లేదని, రానున్న వేసవి కాలం దృష్ట్యా తాగునీటి సమస్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా గ్రామానికి సరైన రహదారి లేకపొవడంతో తామంతా ఇక్కట్లు పడుతున్నామన్నారు. సమస్యలను పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకువచ్చినప్పటికీ ఇంతవరకు ఎటువంటి ఫలితం లేదన్నారు. కలెక్టర్ స్పందించారు. వినతుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న బీడీఓ సుజిత్ కుమార్ మిశ్రాను ఆ గ్రామంలో పర్యటించి పూర్తి వివరాలు తనకు సమర్పించాలని, అవసరమైన వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.


