రాయగడ: స్థానిక మున్సిపాలిటీ టౌన్ హాల్‌లో ఈ నెల 7వ తేదీ నుంచి జిల్లా స్థాయి యోగా పోటీలను నిర్వహించేందుకు సన్నహాలు జరుగుతున్నాయని స్థానిక యోగా స్టోర్ట్స్ అసోసియేషన్ ప్రకటించింది. మేరకు సోమవారం అసోసియేషన్ అధ్యక్షుడు నృసింగ బాహిణిపతి, జిల్లా యోగా కన్వీనర్, ప్రముఖ హాస్యనటుడు ప్రభాకర్ మిశ్రో, యోగా గురు స్వాధీన పండా, ప్రదీప్ కుమార్ రౌత్, నిర్జారాణి పట్నాయక్‌లు నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఈ మేరకు తెలియజేశారు. రెండు రోజుల పాటుగా జరిగే ఈ పోటీల్లో జిల్లాలో గల వివిధ ప్రాంతాల నుంచి సుమారు రెండు వందల మందికి పైగా ఈ పోటీలకు హాజరవుతున్నట్లు అంచనా వేస్తున్నామన్నారు. వారికి భోజన, వసతి సౌకర్యాలను స్థానిక గోవింద చంద్ర దేవ్ ఉన్నత పాఠశాలలో కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పేర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతున్నట్లు వివరించారు. ఈ పోటీల్లో 10 నుంచి 55 ఏళ్ల లోపు వయసు గలవారు పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు బాహిణిపతి తెలియజేశారు. ఈ పోటీల్లో గెలిపొందినవారు త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని వివరించారు.


