ఉగాది ఉత్సవాలకు ముహూర్తపు రాట
రాయగడ: జిల్లా తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో జరగనున్న ఉగాది ఉత్సవాలకు రంగం సిద్ధమైంది. స్థానిక కొల్లిగుడ సమీపంలోని మైదానంలో సమాఖ్య అధ్యక్షుడు యాళ్ల కొండబాబు ఆధ్వర్యంలో ఆదివారం మూహూర్తపు రాట వేసే కార్యక్రమం జరిగింది. వేద పండితులు రేజేటి శ్రీనివాస్ శర్మ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సమాఖ్య అధ్యక్షులు కొండబాబుతోపాటు డి.లక్ష్మణరావు, ఆదినారాయణ, సాయిప్రియ మహిళ వాకర్స్ క్లబ్ అధ్యక్షురాలు పొట్టాం రామాదేవి, పట్టణ ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నెల 19న జరగనున్న ఉగాది ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కొండబాబు తెలియజేశారు. మూడేళ్లుగా ఉత్సవాలను తన ఆధ్వర్యంలో అందరి సహకారంతో నిర్వహిస్తున్నామన్నారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేందుకు ఉగాది వేదికగా మారిందని అన్నారు. రెండు రోజులు ఉత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఈ సందర్భంగా వివిధ పోటీలు నిర్వహిస్తామన్నారు.
ఉగాది ఉత్సవాలకు ముహూర్తపు రాట


