రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి ఎం.వి 79 పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఎంవివి 55 గ్రామం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సుక్రి సర్కార్ (55) మృతి చెందారు. ఈమె భర్త పరితోష్‌కు తీవ్రగాయాలయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఈ జంట శుక్రవారం మధ్యాహ్నం బలిమెల నుంచి కలిమెల సమితి ఎంవి 81 గ్రామంలో నివసిస్తున్న బంధువుల ఇంటికి వెళ్లారు. శనివారం ఉదయం అక్కడ నుంచి బయలుదేరి తిరిగి వస్తున్న సమయంలో ఎంవివి 55 గ్రామం వద్ద బైక్ అదుపుతప్పి కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదం చూసిన స్థానికులు రహదారి పక్కనే పడిపోయిన మహిళ తలకు గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. భర్త ప్రాణాలతో ఉండటంతో కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ఎంవి 79 పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. భర్త పరితోష్‌కు కాళ్లు విరిగిపోవడంతో మల్కన్‌గిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


