కొఠియా, పోలవరం ప్రాంతాల పరిశీలన
జయపురం: ఉత్కళ సమ్మిళినీ ప్రతినిధి బృందం వివాదాస్పద కొఠియా, పోలవరం ప్రాంతాల్లో పర్యటించిందని ఉత్కళ సమ్మిళినీ అధ్యక్షుడు డాక్టర్ అద్వైతకుమార్ పాత్రో శుక్రవారం మీడియాకు తెలిపారు. ఉత్కళ సమ్మిళినీ 50వ మహాసభలో ఎన్నికై న నూతన కార్యవర్గ ప్రథమ సమావేశం ఈ నెల 25న జరిగింది. ఆ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించాక కొఠియా, పోలవరం సమస్యలపై అధ్యయనం చేసేందుకు ఒక ప్రతినిధి బృందం ఆయా ప్రాంతాలలో పర్యటించాలని తీర్మానించిందని వెల్లడించారు. రాష్ట్ర ఉత్కళ సమ్మిళినీకి కొత్తగా ఎన్నికై న కార్యవర్గ సభ్యులు, సమ్మిళినీ అధ్యక్షుడు అద్వైత కుమార్ పాత్రో నేతృత్వంలో గత రెండు దినాలు కొఠియా, పోలవరం ప్రాంతాల్లో పర్యటించినట్లు వెల్లడించారు. ప్రతినిధుల బృందంలో పద్మనాభ సామల్, భీమసేన్ మహాపాత్రో, కమల్ చక్రవర్తి, రవీంద్ర కుమార్ మిశ్ర, బిమల్ చంధ్ర షొడంగి, గోపముద్ర మహాపాత్రో, అక్షయ కుమార్‌దాస్,ద దుర్గా ప్రసాద్ పాఢీ, బిరెన్ మోహణ పట్నాయిక్, ప్రకాశ్ చంధ్ర పట్నాయిక్, రవీంధ్ర కుమార్ బెహురియ, దుర్యోధన్ మహారాణ, మదన మోహణ నాయిక్, జగన్నాథ్ మహాపాత్రో,బుల్లు హత్త, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్కళ సమ్మిళినీ అధ్యక్షుడు డాక్టర్ అద్వైత కుమార్ పాత్రో పత్రికల వారికి ఒక ప్రకటనలో వివరిస్తూ ఒడిశా సరిహద్దు రాష్ట్రాలైన చత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలలో 32 జిల్లాలలో ఒడియా ప్రజల పిల్లలకు ఒడియా భాషా బోధన, సంస్కృతి పరిరక్షణకు ఉత్కళ సమ్మిళినీ ఉద్యమిస్తుందని వెల్లడించారు. ఆయా జిల్లాలలో ఒడిశా కళలు, నృత్య నాట్యాలపై ఒడియా ప్రజలను చైతన్యపరిచేందుకు ఒడిశా కళాకారులను, నృత్య బృందాలను తీసుకెళ్లి ప్రదర్శనలు ఇప్పిస్తామన్నారు. కొఠియా, పోలవరం ప్రాంతాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయన్నారు. వంశధార, మహేంద్రగిరి, నాగావళి, శబరి, సీలేరు తదితర నదుల ఎగువ ప్రాంతాలలో దిగువ ప్రాంతంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ నీరు మళ్లించే ప్రయత్నాలు చేస్తోందని అందుచేత ఆయా నదుల ఎగువ ప్రాంతాలలో రాష్ట్ర ప్రభుత్వం బ్యారేజీలు, ఆనకట్టలు నిర్మించాల్సిన అవసరంపై ఉత్కళ సమ్మిళినీ విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు.


