శాస్త్రవేత్తల సహకారంతోనే వికసిత భారత్
భువనేశ్వర్: వైజ్ఞానిక పరిశోధన, ఆవిష్కరణ రంగాల్లో మహిళల పాత్ర వికసిత భారత్ కల సాకారానికి దోహదపడుతుంది. ఈ నేపథ్యంలో విజ్ఞాన శాస్త్రంలో మహిళలు ఇతివృత్తంతో ఈ సంవత్సరం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని స్థానిక భారతీయ సాంకేతిక సంస్థ (ఐఐటీ) జరుపుకుంది. ఏటా భారతీయ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత సర్ సి. వి. రామన్ రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణను స్మరించుకుంటూ ఈ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా స్థానిక జాతీయ వైజ్ఞానిక విద్య మరియు పరిశోధన (నైజర్) డైరెక్టర్ ప్రొఫెసర్ హిరేంద్ర నాథ్ ఘోష్ క్వాంటం ప్రపంచంలో అల్ట్రాఫాస్ట్ స్పెక్ట్రోస్కోపీ అంశంపై సుదీర్ఘంగా ప్రసంగించారు. సెమీకండక్టర్లు, అల్ట్రాఫాస్ట్ లేజర్‌ల నుంచి క్వాంటం కంప్యూటింగ్ వరకు క్వాంటం సైన్స్ ప్రాథమికంగా ఆధునిక సాంకేతికతను మార్చిందని ప్రొఫెసర్ ఘోష్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. అణువులు, పదార్థాలను పరిశీలించడానికి అల్ట్రాఫాస్ట్ స్పెక్ట్రోస్కోపీని ఉపయోగించి 3 దశాబ్దాలకు పైగా చేసిన పరిశోధనల ఆధారంగా చేసుకుని తదుపరి తరం ఆప్టో ఎలక్ట్రానిక్ పరికరాలను అభివృద్ధి చేయడానికి ఫెమ్టోసెకండ్, అటోసెకండ్ ప్రక్రియలను అర్థం చేసుకోవడం చాలా కీలకమని చెప్పారు. నేడు దైనందిన జీవితంలో ఉపయోగించే ఎల్‌ఈడీలు, మొబైల్ డిస్‌ప్లేలు, సౌర ఘటాలు వంటి అనేక సాంకేతికతలు దీర్ఘకాలిక ప్రాథమిక పరిశోధనల ఫలితమని పేర్కొన్నారు. శాసీ్త్రయ పురోగతులను నడిపించడానికి భౌతిక శాస్త్రవేత్తలు, రసాయన శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, జీవ శాస్త్రవేత్తల మధ్య బలమైన అంతర్ విభాగ సహకారం అవసరమన్నారు. కార్యక్రమంలో ఐఐటీ భువనేశ్వర్ డీన్ పోస్ట్ గ్రాడ్యుయేట్, రీసెర్చ్ ప్రోగ్రామ్స్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ భేండే ప్రసంగించారు. ఈ సందర్భంగా పరిశోధనావేత్తలు పోస్టర్ ప్రెజంటేషన్ల ద్వారా తమ పరిశోధనా శైలిని ప్రదర్శించారు. పలువురు అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.


