మౌలిక సదుపాయాలు కల్పించాలి
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో ఆదివాసీలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ గుసాని సమితి ఉప్పలాడ పంచాయతీ కరడా గ్రామంలో సి.పి.ఐ.(ఎం.ఎల్.) లిబరేషన్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు తిరుపతి గోమాంగో అధ్యక్షతన గురువారం సమావేశం నిర్వహించారు. ఇళ్ల పట్టాలు, తాగునీరు, జంగల్ జమ్మి పట్టాలు, ఖేత్ మజ్దూర్ కార్మికులకు రేషన్ కార్డులు మంజూరు, దినసరి కూలీ రూ.600లకు పెంపు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం వ్యవసాయ కార్మికులకు వర్తింపజేయాలని కోరారు. ఉప్పలాడ పంచాయతీ కరడా నుంచి పిడోబుడి, నువాసాయి వరకు పక్కా రోడ్డు వేయాలని, రెవెన్యూ అధికారులు నెలకు 15 రోజులు జంగిల్ జమ్మి పట్టాల కోసం గ్రామంలో సర్వే చేపట్టాలని, జీవీబీ రామ్‌జీ పథకం కింద వేతనదారులకు తిరిగి పని దినాలు కల్పించాలని డిమాండు చేశారు. మార్చి 15 లోగా జిల్లాలోని తహసీల్దార్లు తమ డిమాండ్లు నెరవేర్చకుంటే పర్లాకిమిడిలో సి.పి.ఐ.(ఎం.ఎల్) లిబరేషన్ పార్టీ తరఫున ఆందోళన చేపడతామని తిరుపతి గోమాంగో తెలియజేశారు.


