నష్ట పరిహారం చెల్లించాలని ఆందోళన
రాయగడ: జిల్లాలోని బిసంకటక్ సమితి పాయకొడాకులుగుడ ఉన్నత పాఠశాలలో చదువుతున్న బిరేన్ టక్రీ అనే విద్యార్థిపై ఈ ఏడాది జనవరిలో అదే పాఠశాలలో చదువుతున్న మరో విద్యార్థి టార్పెంట్ ఆయిల్‌ని శరీరంపై వేసి తగలబెట్టిన ఘటనలో విద్యార్థి తీవ్రగాయాలకు గురయ్యాడు. దీంతో కటక్‌లోని ఎస్‌సీబీ ఆస్పత్రిలో విద్యార్థి 48 రోజులు చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మృతదేహాన్ని పాఠశాల గేటు వద్ద ఉంచి గురువారం ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఏబీఈవో శాంతిలత ముని తదితరులు సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకారులతో చర్చించారు. అనంతరం నష్ట పరిహారం చెల్లించేవిధంగా హామీ ఇవ్వడంతో మృతదేహానికి దహన సంస్కారాలు పూర్తి చేశారు.


