జనగణనపై శిక్షణ
పర్లాకిమిడి: స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం ఓస్వాన్ కాన్ఫరెన్స్ హాల్‌లో గురువారం ‘2026 జనగణన’పై రెండు రోజులపాటు సబ్ కలెక్టర్, తహసీల్దార్లు, జిల్లా శిక్షాధికారులు, పురపాలక, నగరపాలక మండలి ఈఓలకు మాస్టర్ శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ అక్షయ సునీల్ అగర్వాల్ ప్రారంభించారు. పదేళ్లకు ఒకసారి దేశవ్యాప్తంగా నిర్వహించే జనగణన కార్యక్రమం 2021లో కరోనా వల్ల జరగలేదు. ప్రస్తుతం 2026లో ఏప్రిల్ 16 నుంచి మే 15వ తేదీ వరకు జరుగనుంది. 2026 జనగణన కేంద్ర పోర్టల్‌లో కూడా ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు లభ్యమవుతుందని కలెక్టర్ అగర్వాల్ తెలియజేశారు. ప్రస్తుతం జనగణనతోపాటు గృహా గణన, ఒక్కో కుటుబంలో వారి ఆర్థిక, సామాజిక స్థితిగతులు కూడా గణనలో పొందుపరుస్తారు. రెండు పర్యాయాలపాటు జరిగే జనగణన మొబైల్ యాప్ ద్వారా సెన్సస్ డాటాను నమోదు చేస్తామని కలెక్టర్ అన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఏ.డి.ఎం ఫల్గుణి మఝి, ఏ.డి.ఎం (రెవెన్యూ) మునీంద్ర హానగ, సబ్ కలెక్టర్ అనుప్ పండా, జాతీయ ఇన్‌ఫర్‌మెటిక్స్ కేంద్రం అధికారి మూర్తి, మాస్టర్ ట్రైనర్లు సంతోష్ కుమార్ ఆచారి, బ్లాక్ స్థాయి శిక్షాధికారులు, పథకాల అధికారి డిప్యూటీ డైరక్టర్ ప్రకాశ్ రౌత్, తదితరులు పాల్గొన్నారు.


