రోడ్డు ప్రమాదంలో భర్త దుర్మరణం, భార్యకు తీవ్ర గాయాలు
జయపురం: జయపురం–కొరాపుట్ 26 వ జాతీయ రహదారి ఘాట్ రోడ్డులో బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందగా అతడి భార్య తీవ్రంగా గాయపడ్డారు. జయపురం సదర్ పోలీసు అధికారి వివరాలు ప్రకారం జయపురం–కొరాపుట్ ఘాట్ రోడ్డులో భైరవ మందిరం సమీపాన ఒక ఇసుక లోడు టిప్పర్ జయపురం నుంచి కొరాపుట్ వెళ్తుండగా బొలంగీర్ జిల్లా బుబెల్ గ్రామం వాసి సుధీర్ కుమార్ ఖహుర్(36), అతడి భార్య మాధురి భాగ్‌లు ఒక బులెట్ పై జయపురం నుంచి కొరాపుట్ వైపు వెళ్తున్నారు. ఇసుక వాహనాన్ని ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో టిప్పర్ వెనుక టైర్‌కు ఢీకొన్నారు. దీంతో బులెట్ బండి టైర్ కిందకు వెళ్లిపోయి సుధీర్ సంఘటన స్థలంలోనే మృతి చెందగా అతడి భార్య మాధురి తీవ్రంగా గాయపడింది. సమాచారం అందిన జయపురం సదర్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సుధీర్ మృత దేహంతో పాటు తీవ్రంగా గాయపడిన మాధురిలను జిల్లా కేంద్రాస్పత్రికి తరలించి, ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసు అధికారి సచింత్ర ప్రధాన్ వెల్లడించారు.


