మహిళా సాధికారతే లక్ష్యం
జయపురం: వ్యవసాయ రంగంలో మహిళల భూమిక గుర్తించి వారికి సాధికారత కల్పించటమే ఐక్యరాజ్య సమితి 2026 సంవత్సరాన్ని అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరంగా ప్రకటించిందని కొరాపుట్ జిల్లా వ్యవసాయ అధికారి సంతోష్ కుమార్ దొళ బెహరా వెల్లడించారు. బుధవారం జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితి బొయిపరిగుడ వ్యవసాయ విభాగ కార్యాలయంలో ముఖ్యవక్తగా పాల్గొన్నారు. జయపురం ఎం.ఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ కేంద్రం వారు అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరం 2026ను నిర్వహించారు. ఈ సందర్భంగా సంతోష్ కుమార్ ప్రసంగిస్తూ మహిళా రైతులను ఆత్మనిర్భరులుగా తీర్చిదిద్దటం, పోషక ద్రవ్యాల వ్యవసాయాన్ని ప్రోత్సహించటం, వారిలో వ్యవసాయంపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమాల ద్వారా మహిళా రైతులు వ్యవసాయంలో మరింత విజ్ఞాన వంతులై వ్వవసాయ ఉన్నతిలో భాగస్తులు అవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రధాన ప్రాజెక్టు నిర్వాహకురాలు తృప్తి బారాహి, బొయిపరిగుడ సమితి ఉపాధ్యక్షురాలు పూర్ణిమ బారిక్, జయపురం జిలా వ్యవసాయ అధికారి లొలాటేందు మహాపాత్రో, బొయిపరిగుడ సహకార వ్యవసాయ అధికారి నందు జాని, సమగ్ర శిశు అభివృద్ధి పథకం పర్యవేక్షకురాలు లాల్‌మతి సర్కార్, మండియ రాణి, డాక్టర్ రొయిమతి ఘివురియ, ఎం.ఎస్ స్వామినాథన్ రీసెర్చ్ జెండర్ ఎక్స్‌పర్ట్ సురజిత్ తురుక్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సమితిలోని వివిధ గ్రామ పంచాయతీల నుంచి 70 మందికి పైగా మహిళా రైతులు పాల్గొన్నారు. స్వామినాథన్ రిసేర్చ్ ఫౌండేషన్ డైరెక్టర్ ప్రశాంత కుమార్ పరిడా, సీనియర్ సమన్వయ కర్త అక్షయ కుమార్ పండా పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమ కోఆర్డి నేటర్ అంతర్యామి బిశాయి కార్యక్రమంలో పాల్గొన్న వారికి ధన్యవాదాలు తెలిపారు.


