మాతృభాషలో విద్యాబోధన చేయాలి
రాయగడ: చిన్నారులకు మాతృభాషలో విద్యాబోధన చేస్తే వారు సులువుగా పాఠాలను అర్థం చేసుకుంటారని జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి అభిప్రాయపడ్డారు. స్థానిక డీఆర్‌డీఏ సమావేశం హాల్‌లో మంగళవారం పిరామిల్ ఫౌండేషన్ సంస్థ ఏర్పాటు చేసిన అవగాహన, శిక్షణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. చిన్నారులకు పాఠాలు చేప్పే సమయంలో వారి మాతృభాషలో ఉపాధ్యాయులు బోధించడం ద్వారా వారు సులభంగా అర్థం చేసుకోవడంతోపాటు ఆలోచన శక్తి పెరుగుతోందన్నారు. జిల్లాలో 30 అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్న పిల్లలకు ఆదివాసీల సంప్రదాయాలకు చెందిన భాషల్లో ఒకటైన కుయిలో బోధించడం వారి వికాశానికి ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ‘మాతృభాషలో బోధించండి..మాతృభాషలో చదివించండి’ పోస్టర్లను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా సామాజిక శాఖ అధికారి మీనతీదేవ్ పిరామిల్ ఫౌండేషన్ సంస్థకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.


