ఆయుర్వేద వైద్యంపై విస్తృత ప్రచారం
జయపురం: కొరాపుట్ జిల్లా ఆయుర్వేద వికాస పరిషత్ వార్షిక ఉత్సవాలను నిర్వహించేందుకు మంగళవారం సన్నాహాక సమావేశం జరిగింది. స్థానిక ఆయుర్వేద వికాస పరిషత్ సభాగృహంలో పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ సుదర్శణ గౌడ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కార్యదర్శి కవిరాజ్ పరమేశ్వర పాత్రో, కార్యదర్శి నివేదిక సమర్పించారు. అనంతరం పరిషత్ వార్షికోత్సవంపై సబికులు సుధీర్ఘంగా చర్చించారు. మార్చి ఆఖరి ఆదివారం వార్శిక ఉత్సవాలు నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. ఆయుర్వేద వైద్యం ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేయాలని వైద్యులకు పిలుపునిచ్చింది. వార్షికోత్సవంలో ఆయుర్వేద వైద్యులను, వైద్యశాస్త్ర నిపుణులను, దిశారీలను, ఆయుర్వేద అభిమానులను సన్మానించాలని సమావేశం నిర్ణయించింది. మార్చి ఆఖరి ఆదివారం స్థానిక టౌన్ హాల్‌లో వార్షికోత్సవం నిర్వహించాలని, ఆ ఉత్సవాలకు జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతిని ముఖ్యఅతిథిగా ఆహ్వానించాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రాష్ట్రంలో మూడు ఆయుర్వేద కళాశాలలు ప్రారంభించేందుకు ప్రకటించటం పరిషత్ న్యాయ సలహాదారు రాజేంద్ర కుమార్ గౌడ స్వాగతించారు. భవిష్యత్‌లో ప్రజలకు చేరువలో ఆయుర్వేద వైద్యం అందగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆయుర్వేద పరిషత్‌లు ప్రధాన భూమిక నిర్వహించాలని సూచించారు. ఆ సమావేశంలో పరిషత్ ఉపాధ్యక్షుడు కవిరాజ్ క్షేత్ర వాసి పండా, సహాయ కార్యదర్శి డాక్టర్ సత్యనారాయణ పరిచ, సలహాదారు డాక్టర్ జవహర్‌లాల్ జెన, డాక్టర్ కాళీచరణ్ మహారాణ, హిమాంశు పాణిగ్రహి, శివ కేశవ దాస్, తదితరులు పాల్గొన్నారు.


