ఇళ్ల నిర్మాణం పూర్తిచేయని వారికి నోటీసులు
జయపురం: నిరుపేదలకు సొంత ఇళ్లు కట్టుకునేందుకు ప్రధాన మంత్రి అవాస యోజన పథకంలో నిధులు మంజూరు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ పథకంలోని లబ్ధిదారులు ఎక్కువ మంది ఇళ్ల నిర్మాణ పనులు సగంలో నిలిపి వేయటం, పునాది కూడా వేయనివారు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అటువంటి వారికి జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితి బీడీఓ సుభ్రత్ సాహు రెడ్ నోటీసులు జారీ చేశారు. మంజూరైన ప్రధాన మంత్రి అవాస్ పథకంలోని ఇళ్లు వారం రోజుల్లో పూర్తిచేయకపోతే రేషన్ కార్డులు రద్దు చేస్తామన్నారు. వారందరికీ ప్రభుత్వ సహాయక, సంక్షేమ పథకాలు నిలిపి వేస్తామని రెడ్ నోటీసులలో హెచ్చరించారు. బొయిపరిగుడ సమితి దండాబడి పంచాయతీ దండాబడి గ్రామంలో సమితి బీడీఓ సుభ్రత్ సాహు సిబ్బందితో వెళ్లి ప్రధాన మంత్రి అవాస్ యోజనలో ఇళ్లు పూర్తి చేయని 38 మందికి మంగళవారం రెడ్ నోటీసులు అందజేశారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో బొయిపరిగుడ సమితిలో 12 వందల ప్రధాన మంత్రి అవాస యోజన గృహాలు మంజూరు చేయగా.. వాటిలో నేటివరకు 800లకు పైగా ఇళ్లు పూర్తికాలేదని వెల్లడించారు. నోటీసులు అందజేసిన సమయంలో సమితి చైర్మన్ ప్రశాంత గుప్త, దండాబడి సర్పంచ్ చెండియ ఖిలో, ప్రభుత్వ ఇంజినీర్ ఖిరోద్ బెహర, జూనియర్ ఇంజినీర్ దిలీప్ బెహరా, పంచాయతీ విస్తరణ అధికారి సందీప్ పట్నాయక్, ప్రధాన మంత్రి అవాస్ యోజన బొయిపరిగుడ సమితి కోఆర్డినేటర్ ప్రదీప్ ఆచార్య తదితరులు పాల్గొన్నారు.


