28లోగా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులు ఈ నెల 28లోగా తమ వార్షిక జీవన ప్రమాణ పత్రాలను (లైఫ్ సర్టిఫికెట్) తప్పనిసరిగా సమర్పించాలని శ్రీకాకుళం హెడ్ క్వార్టర్స్ ఉప ఖజానా అధికారి (ఎస్టీవో) చింతాడ రామారావు ఒక ప్రకటనలో కోరారు. నిర్ణీత గడువులోగా ప్రక్రియ పూర్తి చేయని పక్షంలో పెన్షన్ చెల్లింపుల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఉప ఖజానా కార్యాలయ పరిధిలో 6,748 మంది పెన్షనర్లు ఉండగా, ఇప్పటివరకు 5,828 మంది ధ్రువీకరణ పత్రాలను సమర్పించారని, ఇంకా 920 మంది నమోదు చేసుకోవాల్సి ఉందన్నారు. పెన్షనర్లు తమ సమీపంలోని ఖజానా కార్యాలయాల్లో గానీ, నెట్ సెంటర్లలో గానీ, ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లలో గానీ యాప్ ఇన్ స్టాల్ చేసుకుని జీవన ప్రమాణ పత్రాలను సమర్పించవచ్చని వివరించారు. వృద్ధాప్యం, అనారోగ్య కారణాల వల్ల బయోమెట్రిక్ పడని వారు నేరుగా జిల్లా కేంద్రంలో ఉప ఖజానా కార్యాలయాన్ని సంప్రదించి ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని సూచించారు. జీవో ఎంఎస్ నంబర్ 315 ప్రకారం పెన్షన్ పొందుతున్న వారు శ్రీకాకుళం కార్యాలయ పరిధిలో 82 మంది ఉండగా, వారిలో కేవలం 25 మంది మాత్రమే ధ్రువీకరణ పత్రాలు సమర్పించారని ఎస్టీవో తెలిపారు. మిగిలిన వారు ఈనెల 28లోగా సంబంధిత పత్రాలతో వచ్చి ప్రక్రియ పూర్తి చేసుకోవాలని కోరారు.
తలశిలకు జిల్లా నాయకుల పరామర్శ
నరసన్నపేట : ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ నాయకుడు తలశిల రఘురాం కుటుంబాన్ని విజయవాడలోని ఆయన నివాసంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు సోమవారం కలిసి పరామర్శించారు. రఘురాం తండ్రి చంద్రశేఖరరావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో కృష్ణదాస్, ఎచ్చెర్ల, ఆమదాలవలస, టెక్కలి నియోజకవర్గాల సమన్వయకర్తలు గొర్లె కిరణ్‌కుమార్, చింతాడ రవికుమార్ పరామర్శించారు.


